ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Freedom Fighters: ఆ త్యాగాలకు ఏదీ విలువ

ABN, Publish Date - Aug 14 , 2025 | 12:58 AM

‘‘విదేశీయుల పాలన నుంచి భారతదేశ విముక్తి లక్ష్యంగా సాగిన పోరాటాలు, ఉద్యమాలు, మహనీయుల త్యాగాల ఫలితం ఈనాడు మనమంతా అనుభవిస్తున్న స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు. తెలుగు నేల మీద సంఘ సంస్కరణోద్యమం, జాతీయోద్యమం కలగలిసి....

‘‘విదేశీయుల పాలన నుంచి భారతదేశ విముక్తి లక్ష్యంగా సాగిన పోరాటాలు, ఉద్యమాలు, మహనీయుల త్యాగాల ఫలితం ఈనాడు మనమంతా అనుభవిస్తున్న స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు. తెలుగు నేల మీద సంఘ సంస్కరణోద్యమం, జాతీయోద్యమం కలగలిసి... మానవీయ విలువలకు పట్టంకట్టిన అద్భుతమైన కాలం అది. ఆ మహత్తర ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షులు మాత్రమే కాదు, అందులో భాగస్వాములు... గుత్తా జవహరీబాయి, రావూరి మనోరమ, ఏటుకూరి కృష్ణమూర్తి. ‘స్వరాజ్యం మా జన్మహక్కు..’ అని నినదించి జైలుకు వెళ్లిన, ఆ ముగ్గురు స్వాతంత్య్ర సమరయోధులను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘నవ్య’ పలకరించింది.

అమ్మతో కలసి జైలుకెళ్లాను

రావూరి మనోరమ

స్వాతంత్య్ర సమరయోధురాలు, 98 ఏళ్లు

‘‘సొంత గొడవే కానీ స్వాతంత్ర్యోద్యమ విలువలు ఈనాడు పట్టినదెవరికి? ఆనాడు అంతా ఒక్కటై దేశంకోసం పోరాడాం. ఈనాడు ఎవరికి వారు గొప్పగా బతకాలని ప్రతిఒక్కరూ ఆరాటపడుతున్నారు. వ్యక్తిగత స్వార్థం పెరిగింది. మనం ఇవాళ అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు తమకు పుట్టుకతోనే వచ్చినవేనన్నది ఈ తరం అభిప్రాయం. అవి ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా సిద్ధించాయన్న కనీస స్పృహ, ఆలోచన నేటి యువతీ, యువకుల్లో లేకపోవడం బాధాకరం. ఉద్యోగరీత్యా ఎన్నో మంచి అవకాశాలను సునాయాసంగా వదిలి జాతీయోద్యమానికి అంకితమయ్యారు మా నాన్న గోపరాజు రామచంద్రరావు (గోరా). సమాంతరంగా ఆంధ్ర దేశంలో కుల నిర్మూలనోద్యమానికి నాయకత్వం వహించారు. నాస్తికోద్యమంలో ఆయనకు శిష్యుడైన రావూరి అర్జునరావుతో నాకు వివాహం జరిపించి గొప్ప ఆదర్శవాదిగా నిలిచారు. ఇప్పుడు ఆ నిబద్ధత, చిత్తశుద్ధి, నిజాయితీ సమాజంలో పెద్దగా కనిపించడం లేదు.

క్విట్‌ ఇండియా పోరాటం...

ఒక్క స్వాతంత్య్ర పోరాటమే కాదు, సామాజిక మార్పు కోసం మా నాన్న తలపెట్టిన ప్రతి సంఘ సంస్కరణ ఉద్యమంలో అమ్మ సరస్వతీ గోరాతో పాటు మేమంతా పాల్గొన్నాం. క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో విజయవాడలోని ఒకచోట అమ్మ, మా మేనత్త సామ్రాజ్యంతో పాటు నేను, మరి కొంతమంది మహిళలం సమావేశమయ్యాం. అప్పుడు నా వయసు 14 ఏళ్లు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ ర్యాలీకి అలా కదిలామో లేదో... మమ్మల్ని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ సబ్‌ జైలులో కొన్ని రోజులు నిర్బంధించిన తర్వాత... మమ్మల్ని రాయవెల్లూరు జైలుకు తరలించారు. కారాగారం అనే మాటేగానీ... ఆట, పాటలతో చాలా సందడిగా ఉండేది. ఒకరితో ఒకరు ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో మెలిగేవాళ్లు. జైలర్లు కూడా మమ్మల్ని చాలా గౌరవంగా చూసేవారు. ఆ ఆరునెలల జైలు జీవితం మరచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది.

మహాత్ముడు నిర్ణయించిన ముహూర్తం...

అర్జునరావుతో నాకు వివాహం నిశ్చయించిన తర్వాత ఆ విషయాన్ని గాంధీగారికి మా నాన్న చెప్పారు. బులుసు సాంబమూర్తి గారి ద్వారా నా ఇష్టాయిష్టాలను తెలుసుకున్న తర్వాత... సేవాగ్రామ్‌లో తన చేత ుల మీదుగా మా పెళ్లి జరిపిస్తానని మహాత్మా గాంధీ మాట ఇచ్చారు. అయితే... రెండేళ్లు ఆగమన్నారు. నాకు తూర్పుగోదావరి జిల్లాలోని కస్తూర్బా ఆశ్రమంలో జీవన నైపుణ్యాల శిక్షణ ఇప్పించాల్సిందిగా ఆదేశించారు. అర్జున్‌రావును తన వెంట వార్ధాకు తీసుకువెళ్ళారు. ఏడాది తర్వాత ఒక రోజు... 1948, మార్చి 13న మా వివాహానికి మహాత్మాగాంధీ ముహూర్తం ప్రకటించారు. అంతా సవ్యంగా సాగుతోందని అనుకుంటున్న సమయంలో... ఆ ఏడాది జనవరి 30న గాంధీ హత్యకు గురయ్యారు. బాపూజీ లేకపోయినా, ఆయన నిర్ణయించిన ముహూర్తానికి సేవాగ్రామ్‌లోని కస్తూర్బా కుటీరం దగ్గర ఆనాటి దేశ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ లాంటి మహనీయుల సమక్షంలో... అర్జునరావు, నేను నూలుదండలు మార్చుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాం. అతిథులకు వేపిన వేరుశెనగపప్పు, బెల్లం పంచారు.

లోక్‌నాయక్‌ పరామర్శ...

వివాహానంతరం కృష్ణాజిల్లా వానపాములలో కొన్నాళ్లు ఉన్నాం. ఆ సమయంలో నా యోగక్షేమాలు తెలుసుకోవడంకోసం లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణగారు ఆ ఊరు వచ్చారు. గ్రామంలోని దళితవాడలో మేము నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మెచ్చుకొన్నారు. తర్వాత 1960 నుంచి నలభై ఏళ్లకు పైగా గుడివాడలో ‘అంబేద్కర్‌ హరిజన బాలికా వసతి గృహం’ నడిపాం. వారందరికీ నేనే స్వయంగా వండి వడ్డిస్తే, అమ్మాయిల చదువు బాధ్యతను అర్జునరావు చూసుకున్నారు. అలా ఎంతో మంది నిరుపేద అమ్మాయిలకు తల్లిదండ్రులుగా మారి, చేతనైన సాయం అందించడానికి ప్రయత్నించాం. ఒంట్లో ఒపికున్నంత కాలం పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని, నాస్తికవాదాన్ని విస్తృతంగా ప్రచారం చేశాం. ఇప్పుడు మా పిల్లలు మిలావ్‌, చునావ్‌, సాదిక్‌, పవర్‌, అమ్మాయి సూయజ్‌ కలసి ‘మార్పు’ ట్రస్ట్‌ ద్వారా కొన్నిసామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సంపూర్ణ స్వాతంత్య్రం రాలేదు

గుత్తా జవహారి బాయి, 102 ఏళ్లు

‘‘పెద్ద వయసు వల్ల కాలు బయట పెట్టలేకపోయినా, బయట ఏం జరుగుతోందో నాకు తెలుసు. టెలివిజన్‌లో ముఖ్యమైన వార్తలు ప్రతిరోజూ తప్పనిసరిగా చూస్తాను. నేటి రాజకీయాలు బాగోలేవు. అంతా స్వార్థం, అవినీతి, నిలకడలేనితనం. స్వాతంత్య్రం వచ్చి 78ఏళ్లు అయినా... ఈ దేశంలో ఇంకా కూడు, గూడులేనివారు ఎంతోమంది ఉన్నారంటే, సంపూర్ణ స్వాతంత్య్రం రాలేదనే కదా అర్థం! ఏమయ్యాయి ఆనాటి స్వాతంత్ర్యోద్యమ ఆశలు, ఆకాంక్షలు? జాతీయోద్యమంలో మా కుటుంబం మొత్తం పాల్గొని జైలుకు వెళ్లింది. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న కారణంగా నా భర్త గుత్తా సుబ్రహ్మణ్యం సోదరులు రామానుజయ్య, రాఘవయ్య, చలమయ్య, మా ఆడపడుచు రాజారత్నం, నా పెద్ద తోటికోడలు సుందరమ్మ... వీరంతా జైలు శిక్ష అనుభవించారు. సుందరమ్మ అయితే విష జ్వరంతో బాధపడుతూ రాయవెల్లూరు జైలులోనే మరణించింది. ‘బ్రిటిష్‌ ప్రభుత్వం నశించాలి’, ‘స్వాతంత్య్రం కావాలి’ అని రోడ్డుమీద నినాదాలు చేసినందుకు నన్నూ అరెస్టు చేసి, కొద్దిరోజులు జైల్లో ఉంచారు.

నేతాజీకి మా నాన్న స్నేహితుడు

నేతాజీ సుభా్‌షచంద్రబో్‌సకు మా నాన్న గుంటూరు సుబ్బారావు మంచి స్నేహితుడు. కోల్‌కతా ఒరియంటల్‌ కాలేజీలో వారిద్దరికీ పరిచయం. వారిమధ్య చాలాకాలం ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా నడిచాయి. నేతాజీ స్ఫూర్తితో మా నాన్న కూడా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. నాన్నకు ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీతో సత్సంబంధాలున్నాయని తెలిసి పోలీసులు చాలారోజులు ఆయనను వెంటాడారు. అటు నా పుట్టింటివారు, ఇటు మెట్టినింటి వారు స్వాతంత్ర్యోద్యమంతో పాటు సంఘ సంస్కరణోద్యమంలోనూ భాగమయ్యారు. ఇప్పుడు ఆ విలువలను కొనసాగించడానికి యువత ముందుకు రావాలి. మహనీయుల వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలి.’’

ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 12:59 AM