A Library for All: అందరి కోసం ఓ లైబ్రరీ
ABN, Publish Date - Oct 12 , 2025 | 06:43 AM
లైబ్రరీ.. చాలా మందికి ఒక అందమైన జ్ఞాపకం.. పుస్తకాల వాసన.. గంభీరమైన నిశబ్దాలను చాలా మంది మరచిపోరు. ఒకప్పుడు వేసవి సెలవులలో లైబ్రరీకి వెళ్లటం పిల్లలకు ఒక దినచర్య. కానీ కాలంతో పాటుగా...
లైబ్రరీ.. చాలా మందికి ఒక అందమైన జ్ఞాపకం.. పుస్తకాల వాసన.. గంభీరమైన నిశబ్దాలను చాలా మంది మరచిపోరు. ఒకప్పుడు వేసవి సెలవులలో లైబ్రరీకి వెళ్లటం పిల్లలకు ఒక దినచర్య. కానీ కాలంతో పాటుగా సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. ప్రజలలో పుస్తకాలను చదివే అలవాటు తగ్గింది. దీనితో పాటుగా లైబ్రరీల సంఖ్య తగ్గుతూ వచ్చింది. మళ్లీ ప్రజలలో పుస్తకాలను చదివే అలవాటును పెంచటానికి కోఫోర్జ్ అనే సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ, నోయిడాలలో లైబ్రరీలను ఏర్పాటు చేసింది. తాజాగా 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో కూడా ఒక లైబ్రరీని ప్రారంభించింది. ఈ లైబ్రరీలను ప్రారంభించటానికి వెనకున్న ఉద్దేశాలను ఆ కంపెనీ చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ అనురాధ సేహగల్ ‘నవ్య’కి వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
‘‘పిల్లలు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటానికి ఇష్టపడతారు. ముఖ్యంగా బొమ్మల పుస్తకాలు.. రకరకాల రంగు రంగుల ఆట వస్తువులు వారిని ఆకర్షిస్తాయి. ఇదే విధంగా యుక్తవయస్సులో ఉన్నవారికి పుస్తకాలు మంచి స్నేహితులు. అయితే మొబైల్స్, ఐపాడ్స్ వంటి సాంకేతిక సాధనాలు అందుబాటులోకి రావటంతో ప్రజలలో కాగితపు పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోతోంది. ఈ ఒరవడికి తగ్గట్టుగానే ప్రభుత్వాలు నిర్వహించే లైబ్రరీల సంఖ్య తగ్గుతూ వస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకొని- మా కంపెనీ సీఈఓ సింగ్ మా వద్ద ఉన్న సీఎ్‌సఆర్ నిధులతో పబ్లిక్ లైబ్రరీలను స్థాపించాలని పూనుకున్నారు. ఆయన ఉద్దేశం వెనక ఒక నేపథ్యముంది. వారి తండ్రి ఆర్మీ అధికారి. అందువల్ల దేశంలోని అనేక ప్రాంతాలలో ఆయన పెరిగారు. ఆయన ఎక్కడికి వెళ్లినా- అక్కడ లైబ్రరీలు ఉండేవి. ఆయన అక్కడికి వెళ్లి పుస్తకాలు చదువుకొనేవారు. ఆ తర్వాతి కాలంలో ఆయన అమెరికా వెళ్లిపోయారు. అక్కడ స్థిరపడ్డారు. అమెరికాలో ఆయన పిల్లలు చదువుకొనేందుకు పెద్ద పెద్ద లైబ్రరీలు ఉండేవి. ఆయన మన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత పబ్లిక్ లైబ్రరీలు తక్కువగా ఉండటం గమనించారు. సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ లైబ్రరీలను ప్రారంభించాం.
నోయిడా లైబ్రరీ పెద్ద హిట్..
ఒక సాధారణ వ్యక్తి కాసేపు ఎక్కడికైనా వెళ్లి తనకు నచ్చిన పుస్తకం చదువుకోవటానికి వీలైన పరిస్థితులు కల్పించాలనేది మా ఉద్దేశం. దీనితో పాటుగా ఈ మధ్యకాలంలో తల్లితండ్రులు తమ పిల్లలను మాల్స్‌కు మాత్రమే తీసుకువెళ్తున్నారు. పార్కులకు, లైబ్రరీలకు తీసుకువెళ్లటం లేదు. దీనికి కారణం సరైన మౌలిక సదుపాయాలు లేకపోవటం. అన్ని రకాల మౌలిక సదుపాయాలతో అందరూ వచ్చి గడపటానికి వీలైన లైబ్రరీలను నిర్మించాలనేదే మా ఉద్దేశం. దీనిలో భాగంగా గత ఏడాది ఫిబ్రవరిలో నోయిడాలో ఒక లైబ్రరీ ప్రారంభించాం. ఈ ఏడాది జూన్‌లో ఢిల్లీలో మరో లైబ్రరీ నిర్మించాం. ఈ రెండింటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వేల మంది ప్రజలు ఈ లైబ్రరీలకు రావటం మొదలుపెట్టారు. వారి దగ్గర నుంచి వచ్చిన రెస్సాన్స్ ఆధారంగా ఈ వారం హైదరాబాద్‌లో లైబ్రరీని ప్రారంభించాం. సుమారు 15 వేల చదరపు అడుగులలో ఈ లైబ్రరీ ఉంది. దీనిలో సుమారు 15 వేల పుస్తకాలు ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో అన్ని విభాగాల్లో అందరి ప్రశంసలు పొందిన పుస్తకాలను దీనిలో ఉంచాం. ముఖ్యంగా పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ప్రారంభించాం. తమ ఖాళీ సమయాల్లో తల్లితండ్రులు- పిల్లలను మాల్స్‌కు మాత్రమే కాకుండా ఇక్కడికి కూడా తీసుకురావచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ఈ లైబ్రరీ ప్రజలందరూ తమ ఖాళీ సమయంలో వచ్చి మనసుకు నచ్చిన పుస్తకాలను చదువుకోవటానికి మాత్రమే! సాధారణంగా లైబ్రరీలలో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ తరహా కార్యక్రమాలను ఇంకా అనుమతించటం లేదు. ఈ లైబ్రరీకి తొలి రోజు నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అలా ఉంటే జగన్ తట్టుకోలేడు... పల్లా షాకింగ్ కామెంట్స్
కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్..
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 12 , 2025 | 06:43 AM