Kuna Ravikumar Accuses Jagan: కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్..
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:29 PM
నేరస్తుల అడ్డా వైసీపీ అని... నేరస్థులకు పేటెంట్ వైసీపీ నాయకులని.. దానికి గౌరవ అధ్యక్షుడు జగన్ అంటూ కూన రవికుమార్ వ్యాఖ్యాలు చేశారు. కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్మినవాళ్ళకి సీట్లు ఇచ్చి, పదవులు ఇచ్చిన కల్తీ పార్టీ వైసీపీ అంటూ దుయ్యబట్టారు.
శ్రీకాకుళం, అక్టోబర్ 11: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై (Former CM Jagan) ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డివి వింత పోకడలని... చిల్లర వ్యక్తులులాగా ప్రవర్తించారని మండిపడ్డారు. గడిచిన 75 ఏళ్ళ భారత చరిత్రలో కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్ అని అన్నారు. కల్తీ మద్యాన్ని ప్రవేశ పెట్టింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే అని వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యానికి సూత్రధారి ఎక్కడ అంటే తాడేపల్లి పాలస్ అని అన్నారు. కల్తీ మద్యం అమ్మించి వేలాది రూపాయలు దోపిడి చేశారని.. వాటితో షెల్ కంపెనీల ద్వారా వ్యాపారం చేశారని... మనీ లాండరింగ్ చేశారని ఆరోపించారు. దమ్ముంటే కల్తీ మద్యంపై చర్చకు రావాలని జగన్‌కు ఎమ్మెల్యే సవాల్ విసిరారు.
వారిని ప్రోత్సహించింది జగన్...
నేరస్తుల అడ్డా వైసీపీ అని... నేరస్థులకు పేటెంట్ వైసీపీ నాయకులని.. దానికి గౌరవ అధ్యక్షుడు జగన్ అంటూ వ్యాఖ్యాలు చేశారు. కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్మినవాళ్ళకి సీట్లు ఇచ్చి, పదవులు ఇచ్చిన కల్తీ పార్టీ వైసీపీ అంటూ దుయ్యబట్టారు. కల్తీ మద్యంలో ఉన్న కుట్రదారులను ప్రోత్సహించింది జగన్ అని ఆరోపించారు. వైసీపీ హయాంలో మల్లాది విష్ణు బార్‌లో కల్తీ మద్యం తాగి చనిపోతే వారికి పదవులు ఇచ్చారని... తమరి హయాంలో జరిగిన కల్తీ మద్యం కేసు వాస్తవం కాదా అని జగన్‌ను ప్రశ్నించారు కూన రవికుమార్. వైసీపీ హయాంలో అమ్మిన మద్యంలో క్రిమిసంహారక మందులున్నాయని అమెరికా, ఇతర ప్రయోగశాలల్లో జరిగిన పరిశోధనల్లో సర్టిఫికెట్స్ వచ్చాయని వెల్లడించారు. అవి తాగి లక్షలాది మంది ప్రాణాలు పోయాయన్నారు. లక్షలాది మందికి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయని తెలిపారు.
జగన్‌కు సీఎంగా అర్హత లేదు..
జగన్ కల్తీ మద్యం వల్ల ప్రతి గ్రామంలో కిడ్నీ పేషెంట్‌లు ఉన్నారని.. రాష్ట్రంలో కిడ్నీ పేషెంట్లు ఎక్కువ అయ్యారన్నారు. ఇవి నిరూపించటానికి తాను సిద్ధంగా ఉన్నానని.. జగన్ మోహన్ రెడ్డికి దమ్ముందా అంటూ ఛాలెంజ్ విసిరారు. కల్తీ మద్యం, మాదక ద్రవ్యాలు, గంజాయి అమ్మకాలు జరిపిన పార్టీ వైసీపీ అంటూ విరుచుకుపడ్డారు. జగన్‌కు అవినీతి, దోపిడి, అరాచకాలపైనే ప్రణాళిక అంటూ కామెంట్స్ చేశారు. జగన్‌కు సీఎంగా చేసే అర్హత లేదన్నారు.
ప్రజల ఆరోగ్యం ముఖ్యం...
తమ ప్రభుత్వం కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపుతోందని అన్నారు. పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చి కల్తీ మద్యాన్ని నిర్మూలించామని నిరూపించింది తమ పార్టీ అని చెప్పుకొచ్చారు. కల్తీ మద్యం తయారీలో తమ పార్టీ నాయకుడు ఉన్నాడని తెలిస్తే వెంటనే సస్పెండ్ చేశామని వెల్లడించారు. బెల్ట్ షాపులపై ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని.. ప్రజల ఆరోగ్యం ముఖ్యమని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యంపై 13 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని.. జిన్ను,రమ్ము, విస్కీలపై 9 రకాలు పరీక్షలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
జగన్ హయాంలో ఒక్క పరీక్ష అయినా చేశారా... దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది జగన్ మోహన్ రెడ్డి మాటలు అంటూ ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వ కాలంలో జరిగిన వాటికి సమాధానం చెప్పి అప్పుడు చర్చకు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ‘కల్తీ మద్యం కేసులో నువ్వొక ముద్దాయివి... నువ్వు కల్తీ మద్యంపై విచారణను కోరుతవా’ అంటూ మిథున్ రెడ్డిపై కూడా కూన రవికుమార్ విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి...
Read Latest AP News And Telugu News