Pawan Kalyan Women Empowerment: సమాజంలో మార్పు.. మహిళల ద్వారానే సాధ్యం: పవన్
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:17 PM
ఓజీ అంటే ఏమిటి అని ఎలా చూశారో.. పుస్తకం టైటిల్ కూడా ఉత్సకతను రేకెత్తించేలా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఐఎఫ్‌ఎస్ చదువుకున్న లక్ష్మీ నుంచి ఇలాంటి పుస్తకం రావడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.
విజయవాడ, అక్టోబర్ 11: నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తక ఆవిష్కరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘నా పైన పుస్తక ప్రభావం ఎంతో ఉంది.. పుస్తక పఠనం ద్వారా ఎన్నో నేర్చుకున్నాను. నేను మారిపోయాను అని కమ్యూనిస్టులు అంటున్నారు... కానీ నేను ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉంటాను. కమ్యూనిస్టు చరిత్ర, భారతీయ చరిత్ర, విశ్వదర్శనం వంటి పుస్తకాలు ఒకే సమయంలో నేను చదివాను. నేను అన్ని అంశాలపై లోతుగా పరిశీలన చేస్తాను.. మంచి పుస్తకాల కోసం తపన పడతాను. ఒక్కో పుస్తకంలో రాసే జీవితం.. వాటిలో అంశాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. లక్ష్మీముట్టేస్ పూరి రాసిన సూర్యుడిని కబళించింది అంటే.. ఎంతో శక్తి వంతులు అని అర్థం. హనుమంతుడే సూర్యుడిని కబళించేందుకు వెళ్లారు.. సాధించాలి అనుకుంటే.. సూర్యుడిని కూడా మింగేయగలవని అర్ధం’ అని చెప్పుకొచ్చారు.
మహిళలకే తొలి ప్రాధాన్యత..
మామూలుగా మిస్టర్ అండ్ మిసెస్ అంటున్నాం.. కానీ మన భారత సంస్కృతి ప్రకారం మహిళలకే తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఓజీ అంటే ఏమిటి అని ఎలా చూశారో.. పుస్తకం టైటిల్ కూడా ఉత్సకతను రేకెత్తించేలా ఉందన్నారు. ఐఎఫ్‌ఎస్ చదువుకున్న లక్ష్మీ నుంచి ఇలాంటి పుస్తకం రావడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. స్వాంతంత్ర్య సంగ్రామ సమయంలో దీరోదాత్త వనిత మాలతి పోరాటాన్నిఈ పుస్తకంలో ప్రస్తావించారన్నారు. మనం పూజించేది దుర్గాదేవిని.. ప్రతి మహిళను తాను అలా దుర్గాదేవిగా చూస్తానని డిప్యూటీ సీఎం తెలిపారు.
తల్లి, వదిన దగ్గర ఎన్నో నేర్చుకున్నా...
లలితా త్రిపుర సుందరీ దేవిని ప్రార్ధిస్తే.. మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయన్నారు. మన దేశంలో, మన సంస్కృతిలో అత్యున్నత గౌరవం స్త్రీకే ఇస్తామని చెప్పుకొచ్చారు. తాను జనసేన పెట్టినప్పుడు ఝాన్సీ వీర మహిళ అని మహిళా విభాగానికి పెట్టాలని నిర్ణయించానని తెలిపారు. సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళల ద్వారానే సాధ్యం.. అందుకే వీర మహిళ విభాగం అని పెట్టానని వెల్లడించారు. ‘నేడు మా అమ్మకు బాగోలేదు.. బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. మాకు మా అమ్మ ఎంత అండగా నిలబడిందో మాకు తెలుసు. నాన్న బదిలీలు కారణంగా అనేక ప్రాంతాలకు వెళ్లినా.. కొత్త ప్రదేశంలో మా అమ్మ మాకు అనేక అంశాలు చెప్పేది. ఎవరికీ భయపడకు.. నిలబడు.. పది దెబ్బలు తిన్నా.. ఎదురు తిరిగి ఒక్క దెబ్బ కొట్టు అని మా అమ్మ చెప్పిన మాట ఇది. సగటు భారతీయ మహిళల ఆలోచనలు ఎప్పుడూ ఇలానే ఉంటాయి. అటువంటి తల్లి, మా వదిన దగ్గర నేను పెరిగి ఎన్నో నేర్చుకున్నాను’ అంటూ గుర్తుచేసుకున్నారు.
పుస్తక పఠనం ద్వారా...
మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలిపారు. ఉమెన్ ఎమ్‌పవర్‌మెంట్ అంటే.. ఉదాహరణ ఈ పుస్తకం రాసిన లక్ష్మీ అని వెల్లడించారు. ఈ పుస్తకం కూడా ఎంతోమందిలో స్పూర్తి నింపుతుందనే నమ్మకం ఉందన్నారు. మండలి బుద్ద ప్రసాద్ చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరింప చేయడం గౌరవమని భావించినట్లు తెలిపారు. మంత్రి సత్య కుమార్‌కు తెలుగు భాష, సాహిత్యంపై మంచి పట్టు ఉందని ఈరోజే తెలుసుకున్నానని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అందుబాటులోకి వచ్చినా.. పుస్తక పఠనం ద్వారా మరింత విజ్ఞానం వస్తుందనేది నిజమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, పలువురు సాహితీ వేత్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్..
Read Latest AP News And Telugu News