US Embassy Warning: భారతీయులకు అమెరికా ఎంబసీ హెచ్చరిక.. శాశ్వత నిషేధం విధిస్తామంటూ వార్నింగ్
ABN, Publish Date - May 17 , 2025 | 07:07 PM
వీసా గడువుకు మించి అమెరికాలో ఉండే భారతీయులు మళ్లి అమెరికాలో కాలుపెట్టకుండా శాశ్వత నిషేధం విధిస్తామంటూ భారత్‌లోని అమెరికా ఎంబసీ తాజాగా హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఎంబసీ (US Embassy) తాజాగా భారతీయులకు హెచ్చరిక చేసింది. వీసా గడువుకు మించి (Visa Overstay) అమెరికాలో ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. ‘‘ అనుమతించిన సమయం కంటే ఎక్కువగా కాలం అమెరికాలో మీరు ఉంటే బహిష్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మళ్లీ అమెరికాకు రాకుండా శాశ్వత నిషేధం కూడా విధించొచ్చు. టూరిస్టు, స్టూడెంట్, వర్క్ వీసాలపై అమెరికాకు వెళ్లిన భారతీయులందరికీ (Indians) ఈ హెచ్చరిక వస్తుంది’’ అని ఘాటు వార్నింగ్ ఇచ్చింది.
అక్రమవలసలను నిరోధించేందుకు ఎంబసీ ఈ తరహా ప్రకటన విడుదల చేసి ఉండొచ్చని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అమెరికా వెళ్లబోతున్న వారు, లేదా ఇప్పటికే వివిధ వీసాలపై అమెరికాకు చేరుకున్న వారు అక్కడి రూల్స్‌ను తూచాతప్పకుండా పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న చిన్న తప్పుల వల్ల కూడా మళ్లి అమెరికాకు వెళ్లే అవకాశం కోల్పోవచ్చని హెచ్చరిస్తున్నారు.
రెండోసారి అధికారంలోకి వచ్చాక డొనాల్డ్ ట్రంప్ వలసలపై మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన అమెరికాలోని దక్షిణ సరిహద్దు వెంబడి ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇక అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారి చేతికి సంకెళ్లు వేసి మరీ అమెరికా మిలిటరీ విమానాల్లో సొంత దేశాలకు పంపించారు.
వలసలకు సంబంధించిన నిబంధనలను కూడా ట్రంప్ కఠినతరం చేశారు. హెచ్-1బీ వీసా నిబంధనలను మరింత కట్టుదిట్టం చేయడం, కస్టమ్స్ అధికారుల రెయిడ్స్ పెరగడం, అక్రమవలసదారుల సంతానానికి పుట్టుకతో పౌరసత్వ హక్కు విధానంపై నిషేధం విధించడం వంటి చర్యలకు దిగారు.
అయితే, ఈ చర్యలకు అమెరికా కోర్టుల్లో బ్రేకులు పడినా కూడా వలసలను నిషేధించేందుకు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ పరిస్థితి విదేశీయులు, ముఖ్యంగా భారతీయులకు కష్టాలను మిగులుస్తోంది.
ఇవీ చదవండి:
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 17 , 2025 | 07:07 PM