PM Modi: మన దేశ చరిత్రలో ఈరోజు విషాదకరమైన అధ్యాయం : ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్
ABN, Publish Date - Aug 14 , 2025 | 10:31 AM
దేశ విభజన భారత చరిత్రలో విషాదకరమైన అధ్యాయం అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ 'పార్టీషన్ హర్రర్స్ రిమంబరెన్స్ డే' నాడు ఆయన.. పాకిస్థాన్ విడిపోయిన సందర్భంలో జరిగిన మారణహోమాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 14 : దేశ విభజన భారతదేశ చరిత్రలో విషాదకరమైన అధ్యాయం అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ(గురువారం) పార్టీషన్ హర్రర్స్ రిమంబరెన్స్ డే (విభజన భయానక జ్ఞాపకాల దినం) నాడు ఆయన కీలక ప్రకటన చేశారు. భారతదేశ విభజన కారణంగా జరిగిన తిరుగుబాటు, ఆ బాధ భరించిన ప్రజలకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఈ మేరకు మోదీ సోషల్ మీడియా X లో పోస్ట్ పెట్టారు. దేశ విభజనను భారత చరిత్రలో 'విషాద అధ్యాయం' అని ఆయన పేర్కొన్నారు. భారత్, పాకిస్థాన్ లుగా భారతదేశం విడిపోయిన సందర్భంలో జరిగిన రక్తపాతాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుకు తెచ్చుకున్నారు.
'మన చరిత్రలోని ఆ విషాదకరమైన అధ్యాయంలో లెక్కలేనన్ని మంది ప్రజలు అనుభవించిన బాధను గుర్తుచేసుకుంటూ భారతదేశం #PartitionHorrorsRemembranceDayని జరుపుకుంటుంది. ఇది వారి ధైర్యాన్ని గౌరవించే రోజు... ఊహించలేని నష్టాన్ని ఎదుర్కోవడానికి, కొత్తగా తమ జీవితాలను పునర్నిర్మించుకోవడానికి, అద్భుతమైన మైలురాళ్లను సాధించడానికి ముందుకు సాగిన రోజు. సామరస్యం, బంధాలను బలోపేతం చేయడానికి మన శాశ్వత బాధ్యతను కూడా ఈ రోజు గుర్తు చేస్తుంది.' అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. కాగా, భారతదేశం నుంచి పాకిస్థాన్ వేరే దేశంగా విడిపోయిన వేళ జరిగిన దారుణ మారణకాండకు గుర్తుగా ఈరోజు (ఆగష్టు 14)వ తేదీని 'పార్టీషన్ హర్రర్స్ రిమంబరెన్స్ డే' గా భారత్ పాటిస్తోంది.
'విభజన భయానక జ్ఞాపకాల దినం' సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సోషల్ మీడియా ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. అది '1947 బాధాకరమైన అధ్యాయం'గా ఆయన ఈ రోజును పేర్కొన్నారు.
'1947 నాటి ఆ బాధాకరమైన అధ్యాయాన్ని విభజన భయానక జ్ఞాపకాల దినంగా గుర్తుచేసుకుంటూ, భారతదేశ విభజన తర్వాత ద్వేషం, హింసతో కూడిన భయంకరమైన పరిణామాలను అనుభవించి, ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని చూడవలసి వచ్చిన వారందరికీ నివాళులర్పిస్తున్నాను. నేటికీ, ప్రతి భారతీయుడికి ఆ బాధిత కుటుంబాల పట్ల సానుభూతి ఉంది. దేశంలో సామాజిక సామరస్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం.' అని రాజ్ నాథ్ తన సందేశంలో పేర్కొన్నారు.
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ రోజుపై స్పందించారు.
Updated Date - Aug 14 , 2025 | 12:54 PM