Supreme Court Judges Assets: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడి
ABN, Publish Date - May 07 , 2025 | 05:18 AM
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను వెబ్‌సైట్‌లో వెల్లడించారు. జస్టిస్ విశ్వనాథన్‌కు అత్యధికంగా రూ.120 కోట్ల ఆస్తులున్నట్లు సమాచారం.
ఇళ్లు, డిపాజిట్లు, భూములు
33 మందిలో 21 మంది వివరాలు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో
రూ.120 కోట్లతో శ్రీమంతుడు జస్టిస్ విశ్వనాథన్
సీజేఐ ఖన్నాకు రెండు ఇళ్లు, రూ.2.77 కోట్ల నగదు, స్విఫ్ట్ కారు
సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామక వివరాలూ వెల్లడి
గత రెండున్నరేళ్లలో 14 మంది న్యాయమూర్తుల బంధువులకు చాన్స్
మొత్తం నియామకాల్లో అది 6 శాతమే
న్యూఢిల్లీ, మే 6: భారత సర్వోన్నత న్యాయస్థానం పారదర్శకతలో భాగంగా తన న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను తన వెబ్‌సైట్లో పెట్టింది. ఇప్పటివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 33 మందిలో 21 మంది తమ ఆస్తుల వివరాలను ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. వారిలో జస్టిస్ కేవీ విశ్వనాథన్‌కు అత్యధికంగా రూ.120 కోట్ల ఆస్తి ఢిల్లీ, కోయంబత్తూర్‌లలో ఉన్నట్లు వెల్లడైంది. ఆదాయ పన్ను లెక్కల్లో ఆయన రూ.91.47 కోట్ల ఆస్తిని చూపారు. దిగిపోతున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆస్తుల విలువ కాకుండా వివరాలను ఇచ్చారు. అందులో 55.75 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, దక్షిణ ఢిల్లీలో మూడు బెడ్రూమ్‌ల ఇల్లు, కామన్‌వెల్త్ గేమ్స్ విలేజ్‌లో నాలుగు బెడ్రూముల ఇల్లు ఉన్నాయి. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌కు బ్యాంకు ఖాతాల్లో 19.63 లక్షలు ఉన్నాయి. మహారాష్ట్రలోని అమరావతిలో వారసత్వంగా వచ్చిన ఇల్లు, ముంబైలోని బాంద్రాలో, ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు, అమరావతి, నాగపూర్‌లలో వ్యవసాయ భూమి ఉన్నాయి. ఏప్రిల్ 1న జరిగిన న్యాయమూర్తుల సమావేశంలో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వెబ్‌సైట్లో పెట్టిన సమాచారం ప్రకారం చూస్తే వారంలో దిగిపోతున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నాకు గురుగ్రామ్‌లో 4 బెడ్రూముల ఇంట్లో 56 శాతం వాటా, హిమాచల్ ప్రదేశ్‌లోని డల్‌హౌసీలో ఇంటి వాటా ఉన్నాయి. పీపీఎ్‌ఫలో కోటి, జీపీఎ్‌ఫలో కోటీ 77 లక్షలు, 25 తులాల బంగారం, రెండు కిలోల వెండి, 2015లో కొన్న మారుతి స్విఫ్ట్ కారు ఉన్నాయి.
జస్టిస్ గవాయ్‌కు రూ.5 లక్షల బంగారం, ఆయన భార్యకు 29 లక్షల బంగారం ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న జస్టిస్ సూర్యకాంత్‌కు చండీగఢ్‌లో ఇల్లు, పంచకులలో 13 ఎకరాల వ్యవసాయ భూమి, గురుగావ్‌లో 300 గజాల ప్లాట్ ఉన్నాయి. రూ.4.11 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. బిజీ లాయర్ నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా ఎదిగిన జస్టిస్ విశ్వనాథన్ అత్యధిక ఆస్తులను చూపించారు.న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను అప్‌లోడ్ చేయడమే కాకుండా గత రెండున్నరేళ్లుగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరిగిన విధానాన్ని కూడా సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పెట్టారు. గత రెండున్నరేళ్లలో నియామకానికి పరిశీలించిన పేర్లలో కేవలం 6 శాతం మంది మాత్రమే న్యాయమూర్తుల కుటుంబాలకు చెందిన వారు. మొత్తం 221 మంది పేర్లను జడ్జిలుగా సిఫార్సు చేస్తే అందులో 14 మంది న్యాయమూర్తుల కుటుంబాలకు చెందిన వారని తేలింది. వారిలో ఒకరి (పంజాబ్ హైకోర్టుకు చెందిన న్యాయవాది రోహిత్ కుమార్) పేరును మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించాల్సి ఉంది. రెండున్నరేళ్లలో 221 పేర్లను సుప్రీంకోర్టు సిఫార్సు చేయగా, 29 పేర్లు ఇంకా కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. జస్టిస్ చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా హైకోర్టు కొలీజియాల నుంచి 303 ప్రతిపాదనలు వచ్చాయి. అందులో 170 మంది(56 శాతం) పేర్లను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించింది. అందులో ఏడు శాతం మంది(12) న్యాయమూర్తుల కుటుంబాలకు చెందిన వారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తి అయ్యాక రాష్ట్రాల కొలీజియాల నుంచి 103 ప్రతిపాదనలు రాగా వాటిలో 51 మందిని ఆయన ఆమోదించారు. అందులో ఇద్దరు న్యాయమూర్తుల కుటుంబాలకు చెందిన వారు. ఛత్తీ్‌సగఢ్ హైకోర్టు జడ్జిగా ఎంపికైన జస్టిస్ బిబూ దత్త గురు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు బావ/బావమరిది. జస్టిస్ దత్తగురు ఎంపిక అయినపుడు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కొలీజియంలో లేరు.
జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు..సీజేఐకి త్రిసభ్య కమిటీ నివేదిక
జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో నోట్ల కట్టల వ్యవహారంపై దర్యాప్తు జరిపిన త్రిసభ్య కమిటీ.. తన నివేదికను సీజేఐకి సమర్పించింది. మార్చి 14న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి (ఆ సమయంలో) జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరగ్గా.. మంటలు ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సగం కాలిన నోట్ల కట్టలు దొరికాయన్న వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా మార్చి 22న ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేశారు.
Updated Date - May 07 , 2025 | 05:19 AM