Supreme Court: మీకు కావాల్సింది ఆయన కాదు.. నిఘంటువు
ABN, Publish Date - Jul 17 , 2025 | 06:04 AM
ఆపరేషన్ సిందూర పై అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమూదాబాద్ పెట్టిన వివాదాస్పద పోస్టుల మీద దర్యాప్తు జరుపుతున్న సిట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది
అశోకా వర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో సిట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, జూలై 16: ‘ఆపరేషన్ సిందూర్’పై అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమూదాబాద్ పెట్టిన వివాదాస్పద పోస్టుల మీద దర్యాప్తు జరుపుతున్న సిట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు బృందానికి కావాల్సింది ఆయన కాదని.. (ఆయన పోస్టులను అర్థం చేసుకోవడానికి) నిఘంటువు అని వ్యాఖ్యానించింది. వివాదాస్పద పోస్టులకు సంబంధించి కోర్టు పరిధిలో ఉన్న అంశంపై తప్ప.. మిగతా ఏ అంశంపైన అయినా ఆన్‌లైన్‌లో వ్యాసాలు రాసే హక్కు అలీ ఖాన్‌కు ఉందని తేల్చిచెప్పింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సిట్.. అలీఖాన్‌కు సంబంధించిన ఎలకా్ట్రనిక్ పరికరాలను స్వాధీనం చేసుకుందని, గత పదేళ్లుగా ఆయన ఏయే దేశాలకు వెళ్లారో వివరాలు ఇవ్వాల్సిందిగా అడుగుతోందని ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ బుధవారం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిట్ ఇప్పటికే ఆయన్ను నాలుగుసార్లు విచారణకు పిలిపించిందని తెలిపారు. దీంతో.. అలీ ఖాన్ పెట్టిన రెండు సోషల్ మీడియా పోస్టుల్లోని పదాల భావాలను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి, ఆయా వ్యక్తీకరణలను సరిగ్గా అంచనా వేయడానికి మాత్రమే సిట్ ఏర్పాటైందని ధర్మాసనం గుర్తుచేసింది.
Updated Date - Jul 17 , 2025 | 06:04 AM