Supreme Court: ఆగస్టు 3న నీట్-పీజీ.. ఒకే షిప్టులో నిర్వహణ
ABN, Publish Date - Jun 07 , 2025 | 06:04 AM
దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్-పీజీ 2025)ను ఆగస్టు 3న ఒకే షిఫ్ట్‌లో నిర్వహించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించింది.
న్యూఢిల్లీ, జూన్ 6: దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్-పీజీ 2025)ను ఆగస్టు 3న ఒకే షిఫ్ట్‌లో నిర్వహించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించింది. పరీక్ష నిర్వహణ కోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) 2నెలల గడువు కోరడాన్ని తొలుత ప్రశ్నించిన ధర్మాసనం.. బోర్డు విజ్ఞప్తి నిజాయితీగా ఉందని అభిప్రాయపడింది. అయితే నీట్-పీజీ 2025 నిర్వహణకు ఎన్‌బీఈకి ఇకపై సమయం ఇవ్వబోమని స్పష్టం చేసింది.
అంతకుముందు, ఎన్‌బీఈ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ వాదనలు వినిపిస్తూ.. దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు చిన్న లోపం కూడా లేకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. మొత్తం 2,42,679 మంది అభ్యర్థులకు ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించడానికి దాదాపు 1,000కి పైగా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని విన్నవించారు.
Updated Date - Jun 07 , 2025 | 06:04 AM