National Commissions: సమస్యల సుడిలో కమిషన్లు
ABN, Publish Date - Apr 27 , 2025 | 02:47 AM
జాతీయ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిషన్లను నిధుల కొరత మరియు సిబ్బంది లేమి సమస్యలు కుదిపేస్తున్నాయి. ఈ సమస్యల కారణంగా కమిషన్లు వారి వార్షిక నివేదికలను సకాలంలో సిద్ధం చేయలేకపోతున్నాయి.
జాతీయ ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ కమిషన్లను వేధిస్తున్న సిబ్బంది కొరత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: విస్తృతమైన సామాజిక అంశాలపై పనిచేస్తున్న జాతీయ కమిషన్లను నిధుల కొరత, సిబ్బంది లేమి సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో వార్షిక నివేదికలను ఈ కమిషన్లు సకాలంలో సిద్ధం చేయలేకపోతున్నాయి. వార్షిక నివేదిక తయారీలో జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్లు రెండేళ్లు వెనుకబడి ఉంటే, ఓబీసీ కమిషన్ మూడేళ్ల వెనుక ఉంది. సాధారణంగా ఏటా కమిషన్లు తమ నివేదికలను రాష్ట్రపతికి సమర్పించాలి. సామాజిక సముదాయాలకు అండగా తాము నివేదికల్లో చేసిన సిఫారసుల అమలు తీరును ఎప్పటికప్పుడు కమిషన్లు సమీక్షించాలి. సామాజిక వర్గాలకు రక్షణ, సంక్షేమం, సామాజికార్థిక అభ్యున్నతి కోసం అవసరమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కమిషన్లు అవసరమైన సిఫారసులు చేస్తాయి.
గతంలో ప్రభుత్వాలు రిజర్వేషన్లు, క్రీమీలేయర్ వంటి అంశాలపై విధాన నిర్ణయాల రూపకల్పనలో కమిషన్ల సిఫారసులను పరిగణనలోకి తీసుకొనేవి. కమిషన్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ నివేదికలను తయారుచేసి పార్లమెంటుకు సమర్పించేవి. అయితే, నివేదిక తయారీలో విపరీత జాప్య, ఒక్కొక్క దాని తయారీకి 2-3 ఏళ్లు పడుతుండటంతో కమిషన్ ఏర్పాటు లక్ష్యమే ప్రశ్నార్థకంగా మారింది.
Updated Date - Apr 27 , 2025 | 05:43 AM