Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ
ABN, First Publish Date - 2025-04-21T15:16:32+05:30
PM Modi: వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ మృతి చెందడం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. దేవుని ఆలింగనంలో ఆయన ఆత్మకు శాశ్వత శాంతి లభిస్తుందని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ సోమవారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ మృతికి ఆయన సంతాపాన్ని తెలిపారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలత పెట్టిందన్నారు. భారత ప్రజలపై పోప్ ఫ్రాన్సిస్ ప్రేమాభిమానాలు నిత్యం నిలిచి ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. కాథలిక్ సమాజానికి ఈ సందర్భంగా ఆయన తన సంతాపాన్ని తెలిపారు. అలాగే చిన్ననాటి నుంచి క్రీస్తు ఆదర్శాలను పోప్ ఫ్రాన్సిస్.. తనను తాను అంకితం చేసుకున్నారని వివరించారు. పేదలు, అణగారిన ప్రజలకు ఆయన సేవలందించారని గుర్తు చేశారు. దేవుని ఆలింగనంలో ఆయన ఆత్మకు శాశ్వత శాంతి లభిస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల మంది కాథలిక్కులు.. పోప్ ఫ్రాన్సిస్‌ను ఆరాధిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ఇటలీలో జీ7 శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశం వేదికగా పోప్‌ను ప్రధాని మోదీ కలిసి సంగతి తెలిసిందే. అలాగే పోప్ ఫ్రాన్సిస్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.
అయితే కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) 2022లో పోప్‌ను భారత్‌కు ఆహ్వానించాలని నిర్ణయించింది. అందుకోసం ప్రధాని మోదీని సంప్రదించింది. వీలైనంత త్వరగా అందుకు ఏర్పాట్లు చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు. కానీ పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్యం కారణంగా.. ఆయన దేశానికి రాలేకపోయారని సీబీసీఐ అధ్యక్షుడు మార్ ఆండ్రూస్ తఝుత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పోప్ ఫ్రాన్సిస్ సోమవారం ఉదయం 7.00 గంటలకు మృతి చెందారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు.గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూన్నారు. ఈ నేపథ్యంలో రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
ఆదివారం జరిగిన ఈస్టర్ వేడుకల్లో సైతం ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు వాటికన్ సిటీ వర్గాలు వెల్లడించాయి. పోప్ ఫ్రాన్సిస్ తన 12 ఏళ్ల వయస్సు నుంచే చర్చి, సమాజం, అట్టడుగు వర్గాల కోసం అంకితభావంతో పని చేశారు. 1936,డిసెంబర్ 17వ తేదీన అర్జెంటీనాలో పోప్ ఫ్రాన్సిస్ జన్మించారు. 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఫ్రాన్సిస్ ఎంపికయ్యారు.
For National News And Telugu News
Updated Date - 2025-04-21T15:34:47+05:30 IST