Kiren Rijiju: పార్లమెంటులో అదే ప్రతిష్టంభన
ABN, Publish Date - Aug 07 , 2025 | 04:02 AM
బిహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ ఎస్‌ఐఆర్ వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తోంది..
బిహార్ ఓటర్ల జాబితా సవరణపై కొనసాగుతున్న రచ్చ
న్యూఢిల్లీ, ఆగస్టు 6: బిహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్) వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తోంది. దీనిపై చర్చించాల్సిందేనంటూ విపక్షాలు ఉభయసభలనూ స్తంభింపజేస్తున్నాయి. గత నెల 21న వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి రచ్చ కొనసాగుతోంది. 28, 29 తేదీల్లో లోక్‌సభలో, 30న రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ మాత్రమే సజావుగా సాగింది. మిగతా రోజుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. బుధవారం కూడా ఇదే జరిగింది. నిరసనల నడుమ కాసేపు సభలు సాగినా.. ప్రతిపక్షాల నిరసనలతో గురువారానికి వాయిదాపడ్డాయి. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ వ్యవహారంపై పార్లమెంటులో చర్చించడానికి వీల్లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు లోక్‌సభలో స్పష్టంచేశారు. అదీగాక ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోందని.. దానిపై చర్చకు ఆస్కారం లేదని స్పష్టంచేశారు. అయితే గతంలో రాజ్యాంగ సంస్థలపై పార్లమెంటులో చర్చ జరిగిన సందర్భాలు ఉన్నాయంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు లేఖ రాశారు. ఇదిలా ఉండగా, లోక్‌సభ ఆమోదానికి వచ్చిన జాతీయ క్రీడల పరిపాలన బిల్లు(2025), జాతీయ యాంటీ-డోపింగ్ బిల్లు (2025)లను లోతుగా పరిశీలించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపాలని విపక్షాల ఎంపీలు స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. కీలకమైన ఈ రెండు బిల్లులపై విస్తృత ఏకాభిప్రాయం అవసరమని అభిప్రాయపడ్డాయి.
Updated Date - Aug 07 , 2025 | 04:02 AM