Pahelgam Terrorist Attack: చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
ABN, Publish Date - Apr 22 , 2025 | 09:07 PM
Pahelgam Terrorist Attack: జమ్మూకాశ్మీర్‌లోని పహల్‌గామ్, బైసరీన్ వ్యాలీలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 27 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 12 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఇక, ఈ ఉగ్రదాడిపై టీఆర్‌ఎఫ్ ఉగ్రసంస్థ స్పందించింది.
జమ్మూకాశ్మీర్‌లోని పహల్‌గామ్, బైసరీన్ వ్యాలీలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అత్యంత సమీపం నుంచి ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఏడుగురు టెర్రరిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డారు. టెర్రరిస్టుల కాల్పుల్లో మణించిన వారి సంఖ్య 27కు చేరింది. మరో 12 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన వారిని మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. ఇక, టూరిస్టులపై కాల్పులు జరిపింది తామేనని TRF ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. సంఘటనా స్థలంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
ముస్లిం కాదన్నాడు.. చంపేశారు..
ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి పాల్పడ్డానికి ముందు ముస్లింలా కాదా అన్న సంగతి తెలుసుకుని మరీ కాల్పులకు తెగబడ్డారు. ఓ వ్యక్తిని చంపే ముందు ‘నువ్వు ముస్లింవా’ అని అడిగారు. అతడు కాదని చెప్పడంతో కాల్చి చంపేశారు. అతడి భార్య ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. ‘ నేను సైడుకు కూర్చుని భేల్ పూరి తింటూ ఉన్నాను. నా భర్త పక్కనే ఉన్నాడు. ఓ వ్యక్తి నా భర్త దగ్గరకు వచ్చాడు. ‘నువ్వు ముస్లింవా’ అని అడిగాడు. నా భర్త కాదని చెప్పాడు. అంతే కాల్చి చంపాడు’ అంటూ కన్నీరు మున్నీరు అయింది. ఓ మహిళ తన భర్త శవం దగ్గర కూర్చుని ఏడుస్తున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ దాడి ఘటన క్షమించరానిది: రాష్ట్రపతి ముర్ము
జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడి ఘటనపై రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని క్రూరమైన, అమానవీయ చర్యగా పేర్కొన్నారు. పర్యాటకులపై దాడి ఘటన క్షమించరానిదన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి
జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో..
Gold Rate History: 2000 నుంచి 2025 వరకు బంగారం ధరల్లో ఎంత మార్పు..
Updated Date - Apr 22 , 2025 | 09:22 PM