Operation Sindoor: మా నమ్మకమే గెలిచింది.. పహల్గామ్ దాడిలో మరణించిన ఆదిల్ తండ్రి కీలక వ్యాఖ్యలు..
ABN, Publish Date - May 07 , 2025 | 12:30 PM
పహల్గామ్ దాడిలో మరణించిన 28 మంది బాధితుల హత్యకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసింది. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటక గైడ్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తండ్రి స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా.. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఒక పర్యాటక గైడ్. 28 సంవత్సరాల ఆదిల్ ఉగ్రవాద దాడిలో పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలను పణంగా పెట్టి వీర మరణం పొందాడు. ఉగ్ర దాడిలో చనిపోయిన ఏకైక స్థానికుడు ఇతడే. టూరిస్టులను తన గుర్రంపై స్వారీ చేయించి జీవనం సాగిస్తుండే అతను ఉగ్రవాదులకు ఎదురు తిరిగాడు. వారి నుంచి గన్నులు లాక్కోవడానికి ప్రయత్నించగా ఆ కిరాతకులు అతడ్ని కాల్చి చంపేశారు.
సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ధైర్య సాహసాలకు ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ‘ బ్రేవరీ అవార్డు’ను ప్రకటించింది. అంతేకాకుండా, ఆదిల్ సోదరుడు సయ్యద్ నాజకత్ హుస్సేన్‌కు ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. కాగా, ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ విషయంపై సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తండ్రి హైదర్ షా స్పందించారు.
తన కొడుకుతో సహా పహల్గామ్‌కు చెందిన 28 మంది హత్యకు భారత్ ప్రతీకారం తీర్చుకున్నందుకు తాము చాలా సంతోషంగా ఉన్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భద్రతా దళాలు, ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకున్నాయని, మాకు ప్రధాని మోదీపై నమ్మకం ఉందని, ఆ నమ్మకమే ఈరోజు మాకు న్యాయం జరిగేలా చేసిందని హర్షం వ్యక్తం చేశారు.
Updated Date - May 07 , 2025 | 03:45 PM