Mumbai Platinum Jubilee: ప్లాటినం జూబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ సమావేశం.. ప్రభుత్వ ఖర్చులపై వివాదం..
ABN, Publish Date - Jun 26 , 2025 | 09:44 AM
ప్రభుత్వ నిధులతో నిర్వహించిన ఓ కార్యక్రమం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అందుకు సంబంధించిన ఖర్చు విషయంపై పలువురు నేతలతోపాటు అనేక మంది కూడా అసంతృప్తి వ్యక్తం (Mumbai Platinum Jubilee) చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవల ముంబయిలో జరిగిన ప్లాటినం జూబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ సమావేశం (Mumbai Platinum Jubilee) వివాదాస్పదంగా మారింది. దీనిపై మహారాష్ట్ర కాంగ్రెస్ సహా పలువురు సామాజిక కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ ఇలాంటి రిచ్ పార్టీ నిర్వహించడం, అతిథులకు వెండి ప్లేట్లలో భోజనం అందించడం వంటి చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. ఇది ముంబైలోని విద్యాన్ భవన్ కాంప్లెక్స్‌లో జరిగింది. దేశవ్యాప్తంగా 600 మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ముఖ్య అతిథిగా..
భారత పార్లమెంట్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడ వివాదానికి సంబంధించిన అంశం ఏంటంటే ఆహారానికి పెట్టిన ఖర్చులే. ఈ వేడుకకు హాజరైన వారికి సిల్వర్ ప్లేట్లలో వడ్డించడం వివాదాస్పదంగా మారింది. ఇలాంటి కార్యక్రమాలతో ప్రభుత్వం వృధా ఖర్చులు చేస్తోందంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూనే.. ఇలాంటి ఖర్చులు చేయడం ఏంటని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
విమర్శలు..
ఈ అంశంపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ ఘాటుగా స్పందించారు. 600 మందికి రూ. 5000 విలువైన భోజనం, అది కూడా రూ.550 విలువైన సిల్వర్ ప్లేట్లలో అంటూ విమర్శించారు. రాష్ట్రం కష్టాల్లో కూరుకుపోయినప్పుడు ఈ సిల్వర్ ప్లేట్లలో భోజనం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అలాగే, వ్యవసాయ రుణ మాఫీ, బోనస్ లేనప్పుడు, సంక్షోభానికి సిబ్బంది ఫండ్స్ ఎలా కేటాయిస్తారని ఆరోపించారు. దీంతోపాటు మహారాష్ట్ర కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు విజయ్ వడేటివార్ కూడా దీనిపై స్పందించారు. అనవసరంగా పెట్టిన ఖర్చులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మాత్రం..
సామాజిక కార్యకర్త కుంబార్ మాట్లాడుతూ ఈ వేడుక కోసం అయిన ఖర్చులను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కేవలం ఫుడ్ కోసమే రూ. 27 లక్షల ఖర్చు చేసి ప్రజా డబ్బును వృథా చేశారని ఆరోపించారు. 600 మందికి సిల్వర్ ప్లేట్లలో భోజనం అందించడం ఏంటన్నారు. 40 అడుగుల బ్యానర్లు, తాజ్ ప్యాలెస్, ట్రైడెంట్ హోటళ్లలో ఆతిథ్యం, ఎయిర్ కండీషన్డ్ డైనింగ్ టెంట్స్, చాండ లియర్స్, రెడ్ కార్పెట్స్ ఇలా అన్ని విలాసాలు అత్యంత వృథా ఖర్చు అని పేర్కొన్నారు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. దీంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదం అవుతోంది.
ఇవీ చదవండి:
భారీ వర్షాలు.. ఇద్దరి మృతి, 20 మంది గల్లంతు..
జూన్ 25 నుంచి 30 వరకు వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసా..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 26 , 2025 | 03:07 PM