Minor Daycare Attendant: డే కేర్ సెంటర్‌లో దారుణం.. చిన్నారిని చిత్ర హింసలు పెట్టిన మహిళా సిబ్బంది..
ABN, Publish Date - Aug 11 , 2025 | 11:50 AM
Minor Daycare Attendant: చిన్నారి శరీరంపై తల్లిదండ్రులు గాయాలు గుర్తించారు. అలర్జీ కారణంగా అలా అయిందేమో అని వారు అనుకున్నారు. డే కేర్ సెంటర్‌లోని టీచర్లు ఆ గాయాలపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఓ డే కేర్ సెంటర్‌లో అత్యంత అమానవీయమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. డే కేర్ సెంటర్‌లో పని చేసే మహిళా సిబ్బంది చిన్నారిపై ఘాతుకానికి ఒడిగట్టింది. చిన్నారిని చిత్రహింసలు పెట్టింది. కొట్టి, కొరికి గాయాలపాలు చేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. నోయిడా సెక్టార్ 137లోని పరస్ తీరియా రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఓ డే కేర్ సెంటర్ ఉంది. ఈ డే కేర్ సెంటర్‌ను రెసిడెన్ష్ అసోసియేషన్ స్వయంగా నిర్వహిస్తోంది.
ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లలో ఇలాంటి డే కేర్ సెంటర్లు చాలానే ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని డే కేర్ సెంటర్‌లలో వదిలి ఆఫీస్‌లకు వెళుతూ ఉంటారు. ఆఫీసు అయిపోయిన తర్వాత ఇళ్లకు తీసుకెళుతూ ఉంటారు. ఈ సంఘటన వెలుగులోకి రావటంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. రెండు రోజుల క్రితం చిన్నారి శరీరంపై తల్లిదండ్రులు గాయాలు గుర్తించారు. అలర్జీ కారణంగా అలా అయిందేమో అని వారు అనుకున్నారు. డే కేర్ సెంటర్‌లోని టీచర్లు ఆ గాయాలపై అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ గాయాలను పరీక్షించిన వైద్యులు అవి పంటి గాట్లని తేల్చారు. తల్లిదండ్రులు షాక్ అయ్యారు. చిన్నారిని కొరికింది ఎవరో తెలుసుకోవడానికి డే కేర్ సెంటర్‌లోని సీసీటీవీ కెమెరాలను చెక్ చేశారు. దీంతో భయంకరమైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళా సిబ్బందిని అరెస్ట్ చేశారు.
ఈ సంఘటనపై చిన్నారి తండ్రి సందీప్ మాట్లాడుతూ...‘ మేము మా చిన్నారిని కేవలం రెండు గంటలు మాత్రమే డే కేర్ సెంటర్లో ఉంచుతున్నాం. నెలకు 2,500 ఇస్తున్నాం. అక్కడ ముగ్గురు టీచర్లు ఉంటారని డే కేర్ సెంటర్ యజమాని చెప్పాడు. మా చిన్నారి మహిళా సిబ్బంది చేతిలో ఉంటుందని మాకు తెలియదు. యజమాని, మహిళా సిబ్బంది మీద కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశాడు.
ఇవి కూడా చదవండి
హైడ్రా మార్షల్స్ విధులకు బహిష్కరణ.. ఎమర్జెన్సీ సేవలకు బ్రేక్
నైట్ క్లబ్‌లో కాల్పుల కలకలం.. 8 మంది మృతి..
Updated Date - Aug 11 , 2025 | 12:00 PM