ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Judiciary: జస్టిస్‌ వర్మ ఇంటి ప్రాంగణంలో నోట్ల కట్టలు నిజమే

ABN, Publish Date - Jun 20 , 2025 | 02:37 AM

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంటి ప్రాంగణంలోని స్టోర్‌ రూమ్‌లో పెద్ద మొత్తంలో నోట్లకట్టలు ఉన్నది నిజమేనని.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించిన త్రిసభ్య కమిటీ తేల్చింది.

  • కనీసం 10 మంది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు

  • జడ్జి ఇంట్లో ఎవరో నోట్లకట్టలు పెట్టడం అసాధ్యం

  • జస్టిస్‌ వర్మ దుర్వర్తన నిజమేనని రుజువైంది

  • 64 పేజీల నివేదికలో త్రిసభ్య కమిటీ వెల్లడి

  • 10 మంది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు

  • ఆ స్టోర్‌ రూమ్‌పై నియంత్రణ జస్టిస్‌ వర్మ, ఆయన కుటుంబసభ్యులకే ఉంది

  • డబ్బు గురించి రాయొద్దని ఫైర్‌ సిబ్బందిని జడ్జి వ్యక్తిగత కార్యదర్శి ఆదేశించారు

  • త్రిసభ్య కమిటీ 64 పేజీల నివేదిక

న్యూఢిల్లీ, జూన్‌ 19: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంటి ప్రాంగణంలోని స్టోర్‌ రూమ్‌లో పెద్ద మొత్తంలో నోట్లకట్టలు ఉన్నది నిజమేనని.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించిన త్రిసభ్య కమిటీ తేల్చింది. కాలిన నోట్ల కట్టలు దొరికిన ఆ స్టోర్‌ రూమ్‌.. జస్టిస్‌ వర్మ, ఆయన కుటుంబసభ్యుల పరోక్ష/ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఉండేదని... అనుమతి లేకుండా ఆ గదిలోకి బయటివ్యక్తులు రావడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చి 14న రాత్రి ప్రమాదం జరిగితే.. 15వ తేదీ తెల్లవారుజామున ఆ గదిలోంచి సగం కాలిన నోట్లను తొలగించారనడానికి ఆధారాలున్నాయని పేర్కొంది. మంటలు ఆర్పేవారికి ఆరోజు కనిపించినవి చిన్న నోట్లు కావని, ఆ సొమ్ము చిన్నమొత్తం కాదని.. జస్టిస్‌ వర్మ లేదా ఆయన కుటుంబసభ్యుల ప్రత్యక్ష, పరోక్ష అంగీకారం లేకుండా ఆ గదిలో ఎవరూ పెట్టలేరని తెలిపింది. ఆయన్ను విధుల నుంచి తొలగించడానికి అవసరమైన అన్ని ఆధారాలూ ఉన్నాయని పేర్కొంది.

ప్రస్తుతం అలహాబాద్‌ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్‌ యశ్వంత్‌వర్మ.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో.. ఈ ఏడాది మార్చి 14న ఆయన నివాస ప్రాంగణంలోని ఒక స్టోర్‌రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ గదిలో కాలన నోట్ల కట్టల తాలూకూ ఫొటోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో.. ముగ్గురు సిటింగ్‌ జడ్జిలతో సుప్రీం సీజే విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా ఈ ప్యానెల్‌.. 55 మంది సాక్షులను ప్రశ్నించింది. జస్టిస్‌ వర్మ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. విచారణలో తేలిన అంశాలతో 64 పేజీల నివేదికను ఈ ఏడాది మే 4వ తేదీనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించింది. అందులోని పలు అంశాలు ఇప్పటిదాకా బయటకు వచ్చాయి. ఇప్పుడు పూర్తిస్థాయి నివేదిక ప్రజాబాహుళ్యానికి అందుబాటులోకి వచ్చింది.

నివేదికలో ఏముందంటే..

కనీసం 10 మంది సాక్షులు ఆ గదిలో సగం కాలిన నోట్లను తాము చూసినట్టు తెలిపినట్టు కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ‘‘నేను లోపలికి వెళ్లగానే.. గదిలో కుడివైపు, ఎదురుగా పెద్ద ఎత్తున రూ.500 నోట్ల కట్టలు నేల మీద పడిఉన్నాయి. అంత పెద్ద ఎత్తున నోట్ల కట్టలు నేలపై పడి ఉండడం చూసి తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాను. అలా చూడ్డం నా జీవితంలోనే అదే మొదటిసారి’’ అని ఒక సాక్షి చెప్పిన వివరాలను నివేదికలో పొందుపరిచింది. అలాగే.. ప్రమాదస్థలిని శుభ్రం చేయడం, ఆధారాలను ధ్వంసం చేయడంలో జస్టిస్‌ వర్మ వ్యక్తిగత కార్యదర్శి రాజీందర్‌ సింగ్‌ కార్కి, ఆయన కుమార్తె దియా వర్మ పాత్రపైనా త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. గదిలో ఉన్న కరెన్సీ నోట్ల గురించి రిపోర్టులో రాయొద్దని రాజీందర్‌ సింగ్‌ కార్కి తమతో చెప్పినట్టు.. మంటలు ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక శాఖ సిబ్బంది త్రిసభ్య కమిటీకి వెల్లడించారు. ఒకవేళ ఇది తనపై పన్నిన కుట్రగా జస్టిస్‌ వర్మ భావించి ఉంటే.. ఆయన వెంటనే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు ఎందుకు చేయలేదని, ఢిల్లీ హైకోర్టు సీజే దృష్టికిగానీ, సీజేఐ దృష్టికిగానీ ఎందుకు తేలేదని ప్రశ్నించింది. ఐదుగురు సెక్యూరిటీ గార్డులు నిరంతరం కాపలా కాసే సిట్టింగ్‌ జడ్జి ఇంటి ప్రాంగణంలోని స్టోర్‌ రూమ్‌లో ఎవరో వచ్చి నోట్ల కట్టలు పెట్టడం అసాధ్యమని స్పష్టం చేసింది.

ఆ వ్యాఖ్యలు అగ్నిమాపక శాఖ అధికారివే..

మంటలు ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది అక్కడ తీసిన వీడియోలో.. ‘మహాత్మాగాంధీ మే ఆగ్‌ లగ్‌రహాహై (మహాత్ముడి బొమ్మ ఉన్న నోట్లు కాలిపోతున్నాయని దీని భావం)’ అనే వ్యాఖ్యలు వినిపించాయని, ఆ వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ మనోజ్‌ మెహ్లావత్‌ అని కమిటీ తన నివేదికలో తెలిపింది. ఈ కేసులో.. అందుబాటులో ఉన్న ప్రత్యక్ష, ఎలకా్ట్రనిక్‌ ఆధారాలను బట్టి.. జస్టిస్‌ వర్మపై ఆరోపణలకు తగు ఆధారాలు ఉన్నట్టు విశ్వసిస్తున్నామని.. ఆయన దుర్వర్తన రుజువైందని పేర్కొంది. ఆయన్ను విధుల నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు ఈ ఆధారాలు సరిపోతాయని పేర్కొంది.

నాది కాదు..

తన నివాసప్రాంగణంలోని స్టోర్‌ రూమ్‌లో తగలబడ్డ నోట్ల కట్టలు వెలుగుచూసినప్పటికీ.. వాటితో తనకు ఏ సంబంధమూ లేదని జస్టిస్‌ వర్మ దీనిపై విచారణ జరిపిన త్రిసభ్య ప్యానెల్‌కు తెలిపారు. స్టోర్‌ రూమ్‌లోకి నోట్ల కట్టలు ఎలా వచ్చాయి? మార్చి 15 తెల్లవారుజామున ఆ గదిలోంచి సగం కాలిన నోట్లను ఎవరు తీశారు? అంటూ త్రిసభ్య కమిటీ అడిగిన ప్రశ్నలకు జస్టిస్‌ వర్మ 101 పేజీల సమాధానం ఇచ్చారు. స్టోర్‌ రూమ్‌లో ఉన్నట్టుగా చెబుతున్న నగదు అక్కడికి రావడంలో తన పాత్ర ఏమీ లేదని పేర్కొన్నారు. అక్కడున్న సీసీ కెమెరాలు పనిచేయకపోతే అది తన తప్పు కాదన్నారు. నిజానికి ఆ కెమెరాలు ప్రమాదానికి ముందు బాగానే పనిచేశాయని.. పోలీసులు వాటిని తీసే క్రమంలో పాడై ఉంటాయని పేర్కొన్నారు. అయితే, ఆయన వాదనను త్రిసభ్య కమిటీ తోసిపుచ్చింది. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకునేలోపు ఆ డేటాను భద్రపరించేందుకు తగిన సమయం జస్టిస్‌ వర్మకు ఉందని స్పష్టం చేసింది.

Updated Date - Jun 20 , 2025 | 02:45 AM