Pilotless Drones: గాలమేసి.. గురిచూసి..
ABN, Publish Date - May 17 , 2025 | 04:56 AM
ఆపరేషన్ సిందూర్‌లో భారత వాయుసేన పైలట్ రహిత విమానాలతో పాక్ రాడార్లు, రక్షణ వ్యవస్థలను గందరగోళానికి గురి చేసి, వాటిని ధ్వంసం చేసింది. తరువాత హారోప్ సూసైడ్ డ్రోన్లు, బ్రహ్మోస్ క్షిపణులతో పాక్‌లోని కీలక ఎయిర్‌బేసులను అత్యంత కచ్చితత్వంతో దెబ్బతీయగలిగింది.
పైలట్ రహిత విమానాలను ఎరగా పంపి సుఖోయ్, మిగ్-29లుగా భ్రమింపజేసి..
తమ రక్షణ వ్యవస్థలు, రాడార్లను పాక్ యాక్టివేట్ చేసేలా ఊరించి..
ఆ వ్యవస్థలను, ఎయిర్‌బే్‌సలను ధ్వంసం చేసిన భారత వాయుసేన
న్యూఢిల్లీ, మే 16: భారత్ ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టగానే.. పాక్ విచ్చలవిడిగా డ్రోన్లు, స్వల్ప శ్రేణి క్షిపణులతో దాడులు మొదలుపెట్టింది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత్.. పాక్ మళ్లీ ఆ పనిచేయకుండా, ఆ దేశంలోని కీలక ఎయిర్‌బే్‌సలను దెబ్బతీయాలని నిర్ణయించింది. ఇందుకు బ్రహ్మోస్ క్షిపణులు, హారోప్ సూసైడ్ డ్రోన్లు వంటి అత్యాధునిక ఆయుధాలు వినియోగించాలి. కానీ పాక్ గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్లు వాటిని గుర్తించి అడ్డుకుంటే నష్టం జరగడంతోపాటు మన లక్ష్యమూ నెరవేరదు. ఆ రక్షణ వ్యవస్థలు, రాడార్లను మొదట ధ్వంసం చేస్తే.. ఎయిర్‌బే్‌సలపై దాడి సులువు అవుతుంది. కానీ పాక్ తన రక్షణ వ్యవస్థలను, రాడార్లను ఎక్కడ మోహరించినదీ తెలియదు. వాటిని యాక్టివేట్ చేస్తే తప్ప వాటి ఉనికిని గుర్తించలేని పరిస్థితి. ఇక్కడే మన వాయుసేన వినూత్న ఆలోచన చేసింది. మే 9న అర్ధరాత్రి ‘లక్ష్య, బన్షీజెట్ 40 ప్లస్’ వంటి పైలట్ రహిత విమానాలను రంగంలోకి దింపింది. పాక్‌లో దాడి చేయాలనుకున్న ఎయిర్‌బే్‌సలకు దూరంగా, వేర్వేరు ప్రాంతాల్లోకి వాటిని పంపింది. ఆ పైలట్ రహిత విమానాలను.. సుఖోయ్ ఎంకేఐ30, మిగ్-29 విమానాలుగా, భారీగా ఆయుధాలతో దాడికి వస్తున్నట్టుగా భ్రమింపజేసింది. ఈ గాలానికి చిక్కిన పాక్.. తాను వినియోగించే చైనా తయారీ హెచ్‌క్యూ9 రక్షణ వ్యవస్థను, సామ్ (సర్ఫేస్ టు ఎయిర్) బ్యాటరీ వ్యవస్థలను, రాడార్లను యాక్టివేట్ చేసింది. పైలట్ రహిత విమానాలను అసలైన సుఖోయ్, మిగ్ విమానాలుగా భావించి.. వాటిని కూల్చేందుకు యుద్ధ విమానాలను పంపింది. క్షిపణి వ్యవస్థలనూ అటువైపే టార్గెట్ చేసింది. దీంతో ఆ రక్షణ వ్యవస్థలు, రాడార్లు, వాటిని నియంత్రించే కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు ఎక్కడున్నాయో భారత వాయుసేనకు తెలిసింది. మరుక్షణంలోనే మన వాయుసేన అసలు పని మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ తయారీ హారోప్ లాయిటరింగ్ మ్యూనిషన్లను (సూసైడ్ డ్రోన్లుగా పిలుస్తారు) ప్రయోగించి.. రాడార్లు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలను ధ్వంసం చేసింది. పాక్ గగనతల రక్షణ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఇదే అదనుగా మన వాయుసేన 15 బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించి.. పాకిస్థాన్‌లోని 12 కీలక ఎయిర్‌బే్‌సలలో 11 ఎయిర్‌బే్‌సలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసింది. మనవైపు నష్టమేమీ లేకుండా అత్యాధునిక యుద్ధ తంత్రాల్లో అత్యంత కీలకమైన వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేసింది.
అసలైన యుద్ధ విమానాలుగా.. అలా ఎలా?
భారత్ వద్ద సొంతంగా అభివృద్ధి చేసిన ‘లక్ష్య’తోపాటు యూకే తయారీ ‘బన్షీజెట్ 40 ప్లస్’ పైలట్ రహిత విమానాలు ఉన్నాయి. వీటిని యుద్ధ విమాన పైలట్లకు శిక్షణ ఇచ్చే సమయంలో, యుద్ధ విమానాల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు లక్ష్యాలుగా వినియోగిస్తుంటారు. నిజానికి ఇవి రాడార్లపై సరిగా గుర్తించలేనంత చిన్న పరిమాణంలోనే ఉంటాయి. కానీ వీటిలోని వివిధ పరికరాలు.. అసలైన యుద్ధ విమానాల తరహాలో వివిధ రకాల సిగ్నళ్లను.. యుద్ధ విమానాల ఇంజన్లు, బాడీ నుంచి వెలువడే తీవ్ర ఉష్ణాన్ని పోలినట్టుగా ‘ఇన్‌ఫ్రారెడ్ సిగ్నేచర్ల’ను విడుదల చేస్తాయి. వీటికి డమ్మీ క్షిపణులను కూడా అమర్చవచ్చు. దీనితో శత్రుదేశాల రాడార్లు.. అసలైన యుద్ధ విమానం దూసుకువస్తున్నట్టు భ్రమించి శత్రుదేశాలు వాటిపైకి క్షిపణులు ప్రయోగించడమో, యుద్ధ విమానాలను పంపడమో చేస్తాయి. ఈ పైలట్ రహిత విమానాల్లోని పరికరాల నుంచి వెలువడే సిగ్నళ్లు, సిగ్నేచర్లను వేర్వేరుగా మార్చుకోవచ్చు. శత్రుదేశాల రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను గందరగోళానికి గురిచేయగల ‘ఈసీఎం (ఎలకా్ట్రనిక్ కౌంటర్‌మెజర్స్)’ వ్యవస్థలను అమర్చవచ్చు. మన వాయుసేన వీటిలో సుఖోయ్-30ఎంకేఐ, మిగ్-29 విమానాలు, క్షిపణులతో సహా వస్తున్నట్టుగా సిగ్నళ్లు వెలువర్చేలా ఏర్పాట్లు చేసిందని రక్షణ వర్గాల సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News
Updated Date - May 17 , 2025 | 09:40 AM