Goa Temple Stampede: జాతరలో తొక్కిసలాట.. ఏడుగురు దుర్మరణం..
ABN, Publish Date - May 03 , 2025 | 08:17 AM
గోవాలోని శ్రీ లెరాయీ దేవీ ఆలయం యాత్రలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు దుర్మరణం చెందారు. 30 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు.
గోవాలోని శ్రీ లరాయ్ దేవీ ఆలయం ధార్మిక జాతరలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా ఏడుగురు మృతి చెందారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. గోవా ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. నార్త్ గోవా డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పరామర్శించారు.
అనంతరం ముఖ్యమంత్రి ఈ దుర్ఘటనపై ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. లరాయి దేవి యాత్రలో తొక్కిసలాట విచారకరమని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తాను పరామర్శించానని, వారికి అన్ని రకాల సహాయసహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. సహాయక చర్యలను తాను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు కూడా తెలిపారు. ప్రధాని మోదీ కూడా తనకు ఫోన్ చేశారని, ఈ క్లిష్ట సమయంలో పూర్తి సహాయసహకారాలు అందిస్తానని మాటిచ్చారని తెలిపారు. ఘటనపై ప్రధాని కార్యాలయం కూడా ఎక్స్ వేదికగా స్పందించింది. బాధిత కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారని చెప్పింది.
గోవాలోని శిర్‌గావ్ ప్రాంతంలోని శ్రీ లరాయ్ దేవీ ఆలయంలో ఈ జాతర నిర్వహిస్తుంటారు. పార్వతీ దేవి అవతారంగా భావించే లరాయి దేవిని పూజించి తరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఈ జాతరలో పాల్గొంటారు. ఏటా నిర్వహించే ఈ ఉత్సవాల్లో దొండాచీ యాత్ర ప్రధాన ఆకర్షణ. ఇందులో భక్తులు కణకణలాడే బొగ్గులపై నడుస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక జాతరలో భాగంగా అమ్మవారిని భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. డప్పుల చప్పుడు, జయజయధ్వానాల మధ్య జరిగే ఈ ఊరేగింపులో పాల్గొని లరాయ్ మాత ఆశీస్సుల పొందేందుకు ఏటా వేల మంది ఇందులో పాల్గొంటారు. అయితే, తొక్కిసలాటకు కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనపై అధికారులు పూర్తి స్థాయి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పాకిస్థాన్‌కు గట్టిగా బదులిస్తున్న భారత్
అంబులెన్స్‌లో ఏం తరలిస్తున్నారో తెలిస్తే.. షాక్ అవాక్కవాల్సిందే..
For National News And Telugu News
Updated Date - May 03 , 2025 | 11:42 AM