Share News

Pahalgam Terror Attack: హఫీజ్ సయిద్ భద్రత పెంచిన పాక్

ABN , Publish Date - May 01 , 2025 | 03:47 PM

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి వెనుక లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ ఉన్నట్లు ప్రకటించింది. అయితే ఈ దాడి వెనుక ఆ సంస్థ చీఫ్ హఫీజ్ సయిద్ ఉన్నట్లు భారత్ విశ్వసిస్తోంది. అలాంటి వేళ.. అతడి భద్రతను పాక్ మరింత కట్టుదిట్టం చేసింది.

Pahalgam Terror Attack: హఫీజ్ సయిద్ భద్రత పెంచిన పాక్
Hafiz Saeed

న్యూఢిల్లీ, మే 01: పహల్గాం ఉగ్రదాడికి కీలక సూత్రదారిగా భావిస్తున్న లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయిద్‌కు నాలుగు రెట్ల భద్రత కల్పించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారత్ దాడి చేస్తుందనే భయంతో పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లాహోర్‌లోని హఫీజ్ సయిద్ నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆ దేశానికి చెందిన సాయుధ దళాల సిబ్బంది అతడి నివాస పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు.


పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్ఐతోపాటు లష్కరే తోయిబా కార్యకర్తలు సంయుక్తంగా హఫీజ్ భద్రతను చూస్తున్నట్లు సమాచారం. అలాగే అతడి నివాసానికి నాలుగు కిలోమీటర్ల పరిధి వరకు ద్రోణులతో పహారా ఏర్పాటు చేశారు. ఇక పరిసర ప్రాంతాల్లో హై రిజల్యూషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పాక్ నిఘా వర్గాలు వెల్లడించాయి.


మరోవైపు పహల్గాం దాడికి తమదేనంటూ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించింది. కానీ ఇది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దాడి వెనుక హఫీజ్ సయిద్ హస్తం ఉందని భారత్ నిఘా వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి.


మరోవైపు హఫీజ్ సయ్యిద్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితితోపాటు అమెరికా సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే. అతడి తలపై 10 మిలియన యూఎస్ డాలర్లను బహుమతిగా ప్రకటించింది. అయితే హఫీజ్ సయిద్ నివాసం వద్ద 2021లో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. దీంతో అతడి నివాసం వద్ద పాక్ ప్రభుత్వం భద్రత పెంచింది. తాజాగా మరోసారి అతడి భద్రతను సమీక్షించింది. అనంతరం నాలుగు రెట్ల భద్రతను హాఫీజ్ సయిద్‌కు కల్పించింది.

Pahalgam Terror Attack: పహల్గామే కాదు.. ఆ అటాక్ చేసింది కూడా వీరే..

Updated Date - May 01 , 2025 | 03:47 PM