Aviation Safety: ఇక ఇంధన మీటల తనిఖీలు
ABN, Publish Date - Jul 15 , 2025 | 04:43 AM
అహ్మదాబాద్ విమానప్రమాదం నేపథ్యంలో బోయింగ్ విమానాలను వినియోగిస్తున్న ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇంజన్లకు ఇంధనాన్ని సరఫరా చేసే మీట(ఫ్యూయల్ కంట్రోల్
విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు.. ఈ నెల 21లోపు నివేదికలివ్వాలని వెల్లడి
న్యూఢిల్లీ/దుబాయ్, జూలై 14: అహ్మదాబాద్ విమానప్రమాదం నేపథ్యంలో బోయింగ్ విమానాలను వినియోగిస్తున్న ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇంజన్లకు ఇంధనాన్ని సరఫరా చేసే మీట(ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్)లను తనిఖీ చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21లోపు తనిఖీలను పూర్తిచేసి నివేదికను సమర్పించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. బోయింగ్ 737, 787(8/9/10) డ్రీమ్ లైనర్లలో తనిఖీలు చేయాలని, ఏవైనా మార్పులు చేసి ఉంటే.. ఆ వివరాలను కూడా నివేదికలో తెలియజేయాలని పేర్కొంది. అహ్మదాబాద్‌లో బోయింగ్-787 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదానికి ఇంధన మీట ‘రన్’ స్థితి నుంచి ‘కటా్‌ఫ’కు మారడమే కారణమని దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే..! మరోవైపు, దుబాయ్‌కి చెందిన దిగ్గజ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్‌వేస్ తమ వద్ద ఉన్న బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల విషయంలో అప్రమత్తమైంది. తన వద్ద ఉన్న బోయింగ్-787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇంధన మీటలను తనిఖీ చేస్తోంది.
అనేక ప్రశ్నలు: ఎయిరిండియా సీఈవో
ప్రమాదంపై ప్రాథమిక నివేదిక అనేక ప్రశ్నలను ఉత్పన్నం చేస్తోందని ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ అన్నారు. ఏఏఐబీ నివేదిక కొన్ని విషయాల్లో స్పష్టతనిచ్చినా.. మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోందని తమ సిబ్బందికి పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ‘‘విమానంలో ఎలాంటి మెకానికల్, నిర్వహణ లోపాలు లేవు. ఇంధన నాణ్యత కూడా బాగుంది. టేకా్‌ఫలో ఎలాంటి అసాధారణ పరిస్థితులు కనిపించలేదు. పైలట్లకు ప్రీ-ఫ్లైట్ బ్రీత్-అనలైజర్ పరీక్షలు నిర్వహించాం. దర్యాప్తు కొనసాగుతుండగా.. వదంతులు వస్తుంటాయి. వాటిని పట్టించుకోకుండా.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం’’ అని ఆయన అన్నారు.
మానవ తప్పిదమే: మోహన్ రంగనాథన్
ఎయిరిండియా విమాన ప్రమాదం అతిపెద్ద మానవ తప్పిదమే అని విమానయాన నిపుణుడు కెప్టెన్ మోహన్ రంగనాథన్ స్పష్టం చేశారు. పైలట్ల తప్పిదంపై వస్తున్న ఊహాగానాలను పైలట్ల సంఘాలు ఖండిస్తున్న నేపథ్యంలో.. సోమవారం రంగనాథన్ వెల్లడించిన అభిప్రాయం సంచలనంగా మారుతోంది. ‘‘ప్రాథమిక నివేదికలో తొలుత ఒక ఇంధన మీట ఫెయిల్ అయినట్లు తేలింది. ఆ తర్వాత సెకను వ్యవధిలోనే రెండోది కూడా ఫెయిలయ్యింది. విద్యుత్తు సరఫరా వైఫల్యంతో మీటలు వాటంతట అవే కదలవు. పైలట్ తన చేతితో లాక్‌ను పైకి లేపి.. ‘రన్’ నుంచి ‘కటాఫ్’ లేదా.. ‘కటాఫ్’ నుంచి ‘రన్’ మోడ్‌కి మార్చాలి. ఇది ఆటోమేటిక్‌గా జరిగే వ్యవహారం కానేకాదు’’ అని ఆయన వివరించారు. ‘‘విమానంలో మెకానికల్ లోపం ఉంటే ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చేది’’ అని అభిప్రాయపడ్డారు.
పారదర్శకంగా దర్యాప్తు జరగాలి
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి ఏఏఐబీ నివేదికపై ఎయిరిండియా పైలట్ల సంఘం, ఇండియన్ పైలట్స్ గిల్డ్(ఐపీజీ) అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఊహాగానాలు, సంచలనాలకు దూరంగా.. వాస్తవాధారిత, పారదర్శక దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశాయి. ’’ఈ నివేదికలో కీలకమైన సాంకేతిక వివరణలు, కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్ ట్రాన్ర్స్కిప్టులు లేవు. దీంతో మీడియాలో తప్పుడు కథనాలు పుట్టుకొస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించాయి.
Updated Date - Jul 15 , 2025 | 06:20 AM