Human Rights Violations: అసహజ మరణాల రికార్డులు ధ్వంసం
ABN, Publish Date - Aug 04 , 2025 | 03:42 AM
కర్ణాటకలోని ధర్మస్థళలో అనేకమంది మహిళలు, బాలికల మృతదేహాలను చట్టవిరుద్ధంగా ఖననం చేసిన..
ధర్మస్థళ కేసులో పోస్టుమార్టం నివేదికలు, ఫొటోలూ మాయం
ఆర్టీఐ దరఖాస్తు ద్వారా షాకింగ్ విషయాలు వెలుగులోకి
సిట్‌ను ఆశ్రయించిన సమాచార హక్కు కార్యకర్త జయంత్
బెంగళూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని ధర్మస్థళలో అనేకమంది మహిళలు, బాలికల మృతదేహాలను చట్టవిరుద్ధంగా ఖననం చేసిన కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 2000 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు నమోదైన అసహజ మరణాల రికార్డులు మాయమవడం తాజాగా కలకలం రేపుతోంది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కార్యకర్త జయంత్ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఆ 15 సంవత్సరాల కాలంలో జరిగిన అసహజ మరణాలకు సంబంధించిన రికార్డులు కావాలంటూ జయంత్ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా కోరగా, 2000-2015 మధ్య యూడీఆర్(అసహజ మరణాల రిజిస్టర్)లో నమోదైన మరణాలకు సంబంధించిన అన్ని పత్రాలు, పోస్టుమార్టం నివేదికలు, వాల్‌పోస్టర్లు, నోటీసులు, గుర్తుతెలియని మృతదేహాల గుర్తింపు కోసం తీసిన ఫొటోలను సాధారణ పరిపాలన పరమైన ఆదేశాల మేరకు ధ్వంసం చేశామని బెల్తంగాడి పోలీసులు సమాధానం ఇచ్చినట్టు జయంత్ తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆ సమాచారాన్నంతటినీ డిజిటలైజ్ చేయకుండా ఎలా ధ్వంసం చేస్తారని జయంత్ ప్రశ్నిస్తున్నారు. ధర్మస్థళలో పలు హత్యలు జరిగాయనీ, వాటికి సంబంధించి తాను గతంలోనే ఆరోపణలు చేశాననీ, పలు వేదికలపై ప్రస్తావించానని, అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు.
ఇక్కడ నెలకొన్న భయంకర పరిస్థితుల కారణంగా ఎవరూ వాస్తవాలు చెప్పడం లేదని, తానూ భయపడిన వ్యక్తినే అని తెలిపారు. హత్యలు జరిగినపుడు కొందరు మధ్యవర్తులు తెరపైకి వచ్చి రాజీలు కుదిర్చారన్నారు. హత్యలు ఎవరు చేశారనేది తెలియదని చెప్పారు. సోమవారం సిట్ ముందుకు వెళ్లి సమగ్ర సమాచారం ఇస్తానన్నారు. కాగా, గుర్తుతెలియని ఒక బాలిక మృతదేహాన్ని ఖననం చేయడంలో చట్టపరమైన నిబంధనలన్నింటికీ అధికారులు నీళ్లొదిలారని, అందుకు తానే ప్రత్యక్ష సాక్షినని జయంత్ పేర్కొన్నారు. ఆ ఘటనలో అధికారుల తీరు ఏదో ఒక కుక్క కళేబరాన్ని పాతిపెట్టేసినట్టు ఉందని విమర్శించారు. ఆ ఘటన ఇప్పటికీ తన కళ్లలో మెదులుతూనే ఉందని, అందుకే ఆదివారం సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం)కు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఖననం సందర్భంగా అక్కడ ఉన్న అధికారులందరి పేర్లూ ఫిర్యాదులో పేర్కొన్నానన్నారు.
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 04 , 2025 | 03:42 AM