PM Modi: పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం
ABN, Publish Date - May 22 , 2025 | 02:59 PM
PM Modi: పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. భారతీయుల రక్తంతో ఆడుకున్నందుకు పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి వాణిజ్యం లేదా చర్చలు ఉండబోవని స్పష్టం చేశారు. సిందూరం విస్పోటంగా మారితే అంతా చూస్తారని ఆయన తెలిపారు.
జైపూర్, మే 22: దాయాది దేశం పాకిస్థాన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా కేవలం 22 నిమిషాల్లో పాకిస్థాన్‌లోని తొమ్మిది ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసిందన్నారు. పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన చర్యలు ప్రపంచం మొత్తం చూసిందన్నారు. అంతేకాదు.. శత్రువులు సైతం ఈ ఫలితాన్ని చవి చూశారని తెలిపారు. గురువారం రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదులు తమ మతాన్ని గుర్తించి.. సోదరీమణుల సిందూరాన్ని తుడిచి పెట్టారని గుర్తు చేశారు. సిందూర్ విస్ఫోటంగా మారితే.. దానిని అందరూ చూస్తారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలకు బికనీర్ సభలో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.
పహల్గాం దాడిలో ఉగ్రవాదుల తుపాకీల నుంచి వచ్చిన తూటాలు.. 1.4 బిలియన్ల భారతీయుల గుండెలను చీల్చాయన్నారు. ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కలిసి రావాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. భారత సాయుధ దళాల ధైర్యం కారణంగానే మనం ఈ రోజు ఇలా బలంగా నిలబడ గలిగామన్నారు. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా.. అవి పక్కడ్బందీ వ్యూహా రచన చేశాయని పేర్కొన్నారు. తద్వారా పాకిస్థాన్ మనకు తలవంచిందన్నారు. ఇంకా చెప్పాలంటే పాకిస్థాన్‌కు మోకాళ్లపై నిలబెట్టామన్నారు.
భారతదేశానికి హక్కుగా రావాల్సిన నీటిని పాకిస్తాన్ పొందిందని ఆరోపించారు. భారతీయుల రక్తంతో ఆడుకున్నందుకు పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి వాణిజ్యం లేదా చర్చలు ఉండవన్నారు. ఒక వేళ చర్చలు జరిగితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాత్రమేనని ఈ సందర్భంగా ప్రధాని మోదీ కుండ బద్దలు కొట్టారు. అణు యుద్దం బెదిరింపులకు భారతదేశం భయపడబోదన్నారు. అయితే పాకిస్తాన్‌లోని రహీమ్ యార్ ఖాన్ వైమానిక స్థావరం ప్రస్తుతం అత్యవసర చికిత్స కేంద్రం (ఐసీయూ)లో ఉందని ప్రధాని మోదీ వ్యంగ్యంగా అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
For National News And Telugu News
Updated Date - May 22 , 2025 | 03:36 PM