Delhi Mustafabad building collapse: ఢిల్లీ భవనం కూలిన ఘటన.. మరింతగా పెరిగిన మృతుల సంఖ్య
ABN, Publish Date - Apr 19 , 2025 | 07:41 PM
ఢిల్లీలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. శనివారం తెల్లవారుజామున శక్తివిహార్ ప్రాంతంలో భవనం కూలిన విషయం తెలిసిందే. జాతీయ విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక సిబ్బంది, ఢిల్లీ పోలీసులు, వలంటీర్లు దాదాపు 12 గంటల పాటు శ్రమించి శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు (Delhi Mustafabad building collapse).
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దుర్ఘనలో భవనం యజమాని తెహ్‌సీన్ (60) మృతి చెందారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకుని గాయపడిన 11 మంది ఆసుపత్రిలో చికిత్స అందించగా వారిలో ఆరుగురు అదే రోజు డిశ్చార్జ్ అయ్యారు. మిగతా వారికి చికిత్స కొనసాగుతోంది. భవనం కూలడంతో మొత్తం 22 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు పోలీసులు తెలిపారు.
తెల్లవారుజామున 2.39 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అడీషనల్ డీసీపీ తెలిపారు. సుమారు 2.50కి తమకు సమాచారం అందిందని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఢిల్లీ అగ్నిమాపక దళం కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయని చెప్పారు.
ఈ దుర్ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభమైనట్టు చెప్పారు. ఈ కష్టకాలంలో బాధితులకు భగవంతుడు అండగా నిలవాలని తాను ప్రార్థిస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, ప్రమాదం తాలూకు భయాన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో చిక్కాయి. ఈ వీడియోలు నెట్టింట కాలు పెట్టి కలకలం సృష్టించాయి. భవనం సడెన్‌గా కూలడానికి కారణాలేంటో తెలియాలని పలువురు డిమాండ్ చేశారు. బాధితులకు సంఘీభావం తెలిపారు.
ఇవి కూడా చదవండి:
అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు
వచ్చే నెలలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను భారతీయ గగనయాత్రికుడు శుభాంశూ శుక్లా..
ఎలాన్ మస్క్‌తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ
Updated Date - Apr 19 , 2025 | 09:09 PM