Narendra Modi: వారే.. రాజ్యాంగాన్ని తొక్కేశారు!
ABN, Publish Date - Aug 18 , 2025 | 05:27 AM
రాజ్యాంగ ప్రతిని తలపై పెట్టుకుని నాట్యం చేస్తున్నామని చెప్పుకొనేవారే.. ఆ రాజ్యాంగాన్ని తొక్కేశారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ భావాలకు ద్రోహంచేశారు’’ అంటూ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు.
తలపై పెట్టుకుని నాట్యం చేస్తున్న వారే.. అంబేడ్కర్‌కు ద్రోహం చేశారు
ఢిల్లీలో పారిశుధ్య కార్మికులు గైర్హాజరైతే వారిని జైలుకు పంపే చట్టం తెచ్చారు
ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకున్నారు
కాంగ్రె్‌సపై నిప్పులు చెరిగిన ప్రధాని
ఢిల్లీలో హైవేలను ప్రారంభించిన మోదీ
దీపావళికి ముందే జీఎస్టీ సంస్కరణలు
రాష్ట్రాలు సహకరించాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ, ఆగస్టు 17: ‘‘రాజ్యాంగ ప్రతిని తలపై పెట్టుకుని నాట్యం చేస్తున్నామని చెప్పుకొనేవారే.. ఆ రాజ్యాంగాన్ని తొక్కేశారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ భావాలకు ద్రోహంచేశారు’’ అంటూ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వాలు.. రాజ్యాంగ స్ఫూర్తిని తక్కువ చేశాయని, సామాన్యులను అణిచివేసేలా శాశ్వత చట్టాలను తీసుకువచ్చాయని దుయ్యబట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో రెండు జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధాని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతూ.. కాంగ్రె్‌స పై విమర్శల వర్షం కురిపించారు. ‘‘ఎవరైతే రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని నాట్యం చేస్తున్నామని చెప్పుకొన్నారో.. వారే దానిని తొక్కేశారు. బీఆర్ అంబేడ్కర్ భావాలు, ఆశయాలకు తీరని ద్రోహం చేశారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం-1957లోని ఓ నిబంధనను ఆయన ప్రస్తావించారు. ‘‘ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ చట్టంలో అత్యంత ప్రమాదకరమైన నిబంధన చేర్చారు. ఎవరైనా పారిశుధ్య కార్మికులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ విధులకు గైర్హాజరైతే నెల రోజులపాటు జైలుకు పంపేలా నిబంధన తెచ్చారు. సఫాయీ కర్మచారుల పట్ల వారి (కాంగ్రెస్) ఆలోచన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. అత్యంత చిన్నతప్పుకే కార్మికులను జైల్లో పెట్టాలా? అలాంటి వారు ఇప్పుడు సామాజిక న్యాయం గురించి ఉపన్యాసాలు దంచికొడుతున్నారు. ఇలాంటి వికృత చట్టాలను తేవడం, అమలు చేయ డం వారికే సాధ్యం. అయితే ఇప్పుడున్నది మోదీ. అలాంటి అణిచివేత చట్టాలను గుర్తించి బుట్టదాఖలు చేస్తున్నాం’’ అన్నారు. హరియాణాలోని గత కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ప్రధాని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘హరియాణాలో కాంగ్రెస్ హయాంలో అవినీతి రాజ్యమేలింది. లంచాలు తీసుకోకుండా ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్నీ ఇవ్వలేదు. డబ్బులు, లేకపోతే సిఫారసులతో ఉద్యోగాలను అమ్ముకున్నారు. కానీ, ఇప్పుడు ఈ పరిస్థితి మీకెక్కడా కనిపించదు. సీఎం నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు ఇస్తోంది’’ అని ప్రధాని అన్నారు.
ఢిల్లీ ట్రాఫిక్ కష్టాలకు చెక్!
ఢిల్లీలో రెండు జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్(యూఈఆర్)-2లను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సుమారు రూ.11వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులతో రాజధానివాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అలాగే సోనిపట్, రోహ్‌తక్, బహదూర్‌గఢ్, గురుగ్రామ్‌ల నుంచి విమానాశ్రయానికి చేరుకునే సమయం తగ్గిపోనుంది. కాగా ఢిల్లీలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను అర్థవంతం చేశామని, యూఈఆర్ రహదారి నిర్మాణంలో వినియోగించామని ప్రధాని చెప్పారు. రహదారుల నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులు, ఇంజనీర్లతో మోదీ సంభాషించారు. అనంతరం, నూతన రహదారిపై ప్రధాని రోడ్ షో నిర్వహించారు. ఇదిలా ఉండగా జీఎస్టీ సంస్కరణలకు సంబంధించిన ముసాయిదాను రాష్ట్రాలకు పంపామని ప్రధాని మోదీ తెలిపారు. దీపావళికన్నా ముందే అమలు చేయనున్న ఈ సంస్కరణలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇకపై పీఎంవో ః సెంట్రల్ విస్టా!
వచ్చే నెలలో సౌత్ బ్లాక్ నుంచి తరలింపు
కేంద్ర సెక్రటేరియట్‌లోని సౌత్ బ్లాక్‌లో 78 ఏళ్లకు పైగా ఉన్న ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) వచ్చే నెలలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్తగా నిర్మించిన కార్యనిర్వాహక భవన సముదాయానికి (ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్) తరలివెళ్లనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికార వర్గాలు వెల్లడించాయి. నూతన పీఎంవో కార్యాలయానికి ఒక కొత్త పేరు పెట్టనున్నారు. మూడోసారి అధికారం చేపట్టాక పీఎంవోను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. ప్రజాసేవకు పీఎం వో ఒక ప్రదేశంగా ఉండాలన్న వ్యాఖ్యల స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఆ పేరు ఉండనుందని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ
Updated Date - Aug 18 , 2025 | 05:27 AM