Andhra University Former Registrars: ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ
ABN , Publish Date - Aug 17 , 2025 | 04:52 PM
ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ముగ్గురు పూర్వ రిజిస్ట్రార్‌లకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ వారెంట్ జారీ అయింది.
విశాఖపట్నం, ఆగస్టు 17: ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ముగ్గురు పూర్వ రిజిస్ట్రార్‌లకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కోర్టు ఆదేశాలు ధిక్కరించినందుకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జి రామకృష్ణ ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. సీనియర్ కౌన్సిల్ డీవీ సీతారామమూర్తి, న్యాయవాది అశ్వినీకుమార్ వాదనలను పరిగణలోకి తీసుకున్న అనంతరం న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన పూర్వ రిజిస్ట్రార్లు వెలగపూడి ఉమామహేశ్వరరావు, కే. నిరంజన్, వడ్డాది కృష్ణమోహన్ కోర్టుకు గైర్హాజరు కావడంతో న్యాయమూర్తి ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
ఆంధ్రయూనివర్సిటీ రంగస్థలా విభాగానికి చెందిన ముగ్గురు అధ్యాపకులు తమ ఉద్యోగాలు క్రమబద్దీకరణ చేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రంగస్థల విభాగానికి చెందిన శాశ్వత అధ్యాపకులు అంతా 1999లోనే రిటైరు అయ్యారు. ఈ నేపథ్యంలో నాటి ఏయూ వైస్ చాన్సలర్ రొక్కం రాధాకృష్ణతోపాటు రిజిస్ట్రార్ జె.ఎం.నాయుడు.. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదంతో ముగ్గురు అధ్యాపకులను రంగస్థల విభాగంలోకి తీసుకున్నారు. అలా అధ్యాపకుల్లాగా మల్లెల రాజేంద్ర ప్రసాద్, మరపట్ల భాస్కరావు, మీగడ శిశిభూషణ్‌లు విధుల్లో చేరారు.
అనంతరం వీరిని రెగ్యులరైజ్ చేయలేదు. పే స్కేల్ సైతం అమలు చేయలేదు. దీంతో 2011లో వీరు ముగ్గురు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారించిన హైకోర్టు 2016లో వీరిని బడ్జెట్ వేకెన్సీలలో రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించింది. అందుకు గడువు సైతం విధించింది. దీంతో అప్పటి వైస్ చాన్సలర్ జి.ఎస్.ఎన్. రాజు వీరి అంశాన్ని త్వరితగతిన అమలు చేయాలని ఆదేశించారు. కానీ నాటి వీసీ ఆదేశాలను అప్పటి రిజిస్ట్రార్లు పరిగణలోకి తీసుకోలేదు.
అంతేకాకుండా ఫుల్ బెంచ్ అపీల్‌కు వెళ్లారు. యూనివర్సిటీ వాదనలను ఫుల్ బెంచ్ పరిగణలోకి తీసుకోలేదు. ఆ తర్వాత రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన కె నిరంజన్ సైతం ఆ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు వాదనలు పట్టించుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరంజన్‌తో పాటు ఆ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన వారు.. సైతం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు.
కోర్టు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చినా.. వాటిని పట్టించుకోలేదు. ఉద్దేశ్య పూర్వకంగానే ఈ రిజిస్ట్రార్లు.. ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కోర్టు భావించి.. ఆగస్ట్ 14న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయినా వీరు.. ఆ ఆదేశాలు పట్టించుకోలేదు. దీంతో వారిని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీకి మంత్రి లోకేశ్.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ
For More AP News And Telugu News