Chenab Railway Bridge: చీనాబ్ రైల్వే వంతెనను నిర్మించిందెవరో తెలుసా..
ABN, Publish Date - Jun 06 , 2025 | 10:00 AM
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు చీనార్ రైల్వే వంతెనను ప్రారంభించనున్నారు. ఈ వంతెన ప్రత్యేకతలేంటి.. ఆ వంతెనను నిర్మించిందెవరు.. దీని సామర్థ్యం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
న్యూఢిల్లీ, జూన్ 6: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు కశ్మీర్ లోయను మిగతా ప్రాంతాలను అనుసంధాస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత కీలకమైన విషయం ఏంటంటే.. కొత్త రైల్ మార్గంలో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనను నిర్మించారు. అదే చీనాబ్ రైల్వే వంతెన. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ రైల్ మార్గాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. ఈ మార్గంలో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు.
చీనాబ్ వంతెన ప్రత్యేకత ఏంటంటే..
చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన. ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎత్తు, ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఐదు రెట్లు ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన కాట్రా, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని 3 గంటలు తగ్గించనుంది. ఇది ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్‌లో భాగం. ఈ వంతెన సలాల్ ఆనకట్ట సమీపంలో చీనాబ్ నదిపై 1,315 మీటర్ల పొడువుతో నిర్మించారు. ఈ వంతెనను తీవ్రమైన భూకంపాలు, భారీ స్థాయిలో గాలులు వీచినా తట్టుకుని నిలబడేలా నిర్మించారు.
వంతెనను నిర్మించిందెవరంటే..
ఈ అద్భుతమైన వంతెన నిర్మాణం వెనుక చాలా కంపెనీల శ్రమ ఉంది. విపత్కర పరిస్థితుల్లో, కఠినమైన భూభాగాల్లో ఈ వంతెనను నిర్మించడానికి అంతర్జాతీయ స్థాయిలోని కంపెనీలు, భారతీయ సంస్థలు సంయుక్తంగా పని చేశాయి. వంతెన రూపకల్పన, నిర్మాణ బాధ్యతలను వీఎస్ఎల్ ఇండియా, దక్షిణ కొరియాకు చెందిన ఆల్ట్రా కన్‌స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అప్పగించారు. దీని పునాది డిజైన్ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు అప్పగించారు. ఇక పునాది స్థిరత్వాన్ని ఢిల్లీకి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్లేషించింది. ఈ వంతెనను బ్లాస్ట్ ప్రూఫ్‌గా నిర్మించడంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ((DRDO) కూడా భాగస్వామ్యమైంది. ఫిన్లాండ్‌కు చెందిన డబ్ల్యూఎస్పీ గ్రూప్ వయాడక్ట్, ఫౌండేషన్‌లను రూపొందించగా.. జర్మన్‌కు చెందిన లియోన్‌హార్డ్ ఆండ్రా కంపెనీ ఆర్చ్‌ను రూపొందించింది.
అంజి వంతెనను ప్రారంభించనున్న ప్రధాని..
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు చీనాబ్ వంతెనతో పాటు.. దేశంలోని మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెన అయిన అంజి వంతెనను ప్రారంభించనున్నారు.
ప్రధాని మోదీ కీలక పోస్ట్..
చీనాబ్ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కీలక పోస్ట్ చేశారు. ‘జూన్ 6, జమ్మూ కశ్మీర్ ప్రజలకు నిజంగా ప్రత్యేకమైన రోజు. రూ. 46,000 కోట్ల విలువైన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడం జరుగుతుంది. ఇది ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అసాధారణమైన నిర్మాణ శైలితో పాటు చీనాబ్ రైలు వంతెన జమ్మూ, శ్రీనగర్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. అంజి వంతెన భారతదేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైలు వంతెనగా నిలుస్తుంది.’ అని పేర్కొన్నారు.
Also Read:
కంటోన్మెంట్ పరిధిలో తొలిసారి కూల్చివేతలు
For More National News and Telugu News..
Updated Date - Jun 06 , 2025 | 10:01 AM