PMVBRY: ఉద్యోగాల కల్పనకు కేంద్రం ప్రోత్సాహకాలు
ABN, Publish Date - Jul 26 , 2025 | 03:21 AM
కొత్తగా ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు కేంద్రం నూతన పథకాన్ని ఆవిష్కరించింది... .
పీఎంవీబీఆర్‌వై ఆవిష్కారం.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ, జూలై 25: కొత్తగా ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు కేంద్రం నూతన పథకాన్ని ఆవిష్కరించింది. పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎంవీబీఆర్‌వై) పేరుతో ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించినట్టు శుక్రవారం కార్మిక శాఖ తెలిపింది. ఈ పథకం ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుందని, వచ్చే రెండేళ్లలో 3.5 కోట్లకు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో ఈ పథకానికి రూ.99,446 కోట్లు కేటాయించినట్టు తెలిపింది. ఇందులో 1.92 కోట్ల మంది మొదటిసారిగా ఉద్యోగం పొందిన వారు ఉండాలని ఆశయంగా పెట్టుకొంది. 2025 ఆగస్టు ఒకటో తేదీ నుంచి 2027 జూలై 31లోగా ఈ ఉద్యోగాలను కల్పించాల్సి ఉంటుంది. కొత్తగా ఉద్యోగాలు పొందినవారితోపాటు ఉద్యోగాలు కల్పించిన యజమానులకూ ప్రోత్సాహకాలు అందించనుండడం ఈ పథకం ప్రత్యేకత. వస్తువుల తయారీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ పథకం పార్ట్-ఏలో తొలిసారిగా ఉద్యోగాలు పొందిన వారికి, పార్ట్-బిలో యజమానులకు అందించే ప్రోత్సాహకాలను ప్రస్తావించారు.
తొలిసారిగా ఉద్యోగాలు పొందిన వారు ఈపీఎ్‌ఫవోలో పేరు నమోదు చేసుకొని ఉంటే వారికి ఒక నెల ఈపీఎఫ్ వేతనాన్ని ప్రోత్సాహకంగా ఇస్తారు. ఇది గరిష్ఠంగా రూ.15,000 వరకు ఉంటుంది. రూ.లక్ష వరకు వేతనం పొందే వారూ ఈ ప్రోత్సాహకం పొందేందుకు అర్హులే. ఆరు నెలల సర్వీసు పూర్తయిన తర్వాత తొలి విడత ప్రోత్సాహకం లభిస్తుంది. 12 నెలలు ఉద్యోగం చేసి, యాజమాని నిర్వహించే ‘ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమా’న్ని పూర్తి చేసిన తర్వాత రెండో విడత ప్రోత్సాహకం చెల్లిస్తారు. దీన్ని ఫిక్సిడ్ డిపాజిట్ రూపంలోగానీ, సేవింగ్స్ పత్రాల రూపంలోగానీ కొంతకాలంపాటు డిపాజిట్ చేయాలి. కొత్తగా సృష్టించే ఉద్యోగాలకే ఈ ప్రోత్సాహకం లభిస్తుంది. పార్ట్-బి ప్రకారం అదనంగా కల్పించే ప్రతి ఉద్యోగానికి ప్రోత్సాహకం కింద యజమానికి ప్రతినెలా రూ.3,000 చొప్పున రెండేళ్లు ఇస్తారు. తయారీ రంగ యజమానులకైతే మూడు, నాలుగేళ్లపాటు కూడా ఈ ప్రయోజనం కల్పిస్తారు.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News
Updated Date - Jul 26 , 2025 | 03:21 AM