Rice Price Control: క్వింటాలు బియ్యం రూ.2,250
ABN, Publish Date - Aug 01 , 2025 | 03:48 AM
దేశంలో బియ్యం ధరల నియంత్రణ, నిల్వల సమతుల్యత కోసం కేంద్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ విక్రయ పథకం
‘భారత్ బ్రాండ్’ పేరుతో అమ్మకాలకు కేంద్రం నిర్ణయం
ఎఫ్‌సీఐ వద్ద ఉన్న రూ.202 లక్షల టన్నుల కేటాయింపు
హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): దేశంలో బియ్యం ధరల నియంత్రణ, నిల్వల సమతుల్యత కోసం కేంద్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ విక్రయ పథకం (ఓఎంఎంఎస్) కింద వివిధ వర్గాలకు బియ్యం అమ్మేందుకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వద్ద ఉన్న 202.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపులు చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ ఆమోదంతో ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘భారత్ బ్రాండ్’ పేరుతో ఈ బియ్యం అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్వింటాలు బియ్యానికి రూ.2,250 ధర నిర్ణయించింది. ఇక కేటాయింపుల విషయానికివస్తే.. ప్రైవేటు పార్టీలు, సహకార సంఘాలు, సహకార సమాఖ్యలకు ఈ-టెండర్ విధానంలో విక్రయించటానికి 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించింది. 25 శాతం నూకలతో ఈ బియ్యం విక్రయిస్తారు. 10శాతం నూకలతో ఉన్న 50 లక్షల మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను ప్రైవేటు సంస్థలకు, రైస్‌మిల్లింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పథకం కింద ఉత్పత్తి చేసిన 7.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రైవేటు పార్టీలకు ఈ-వేలం ద్వారా విక్రయిస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, అనుబంధ సంస్థలకు టెండర్లతో సంబంధంలేకుండా నేరుగా విక్రయించాలని నిర్ణయించారు. వీటికి ఇప్పటివరకు విక్రయించిన బియ్యంతో కలిపి ఈ ఏడాది అక్టోబరు 31 వరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు, కమ్యూనిటీ కిచెన్లకు నవంబరు ఒకటో తేదీ నుంచి 2026 జూన్ 30 తేదీ వరకు 32 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం విక్రయించనుంది. ఇథనాల్ ఉత్పత్తికి ఈ ఏడాది అక్టోబరు 31 వరకు 52 లక్షల మెట్రిక్ టన్నులు, నవంబరు ఒకటో తేదీ నుంచి 2026 జూన్ 30 తేదీ వరకు మరో 52 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం విక్రయించనుంది. నాఫెడ్, ఎన్‌సీసీఎ్‌ఫ, కేంద్రియ భండార్ లాంటి సహకారసంస్థలు తమ రిటైల్ దుకాణాలు, మొబైల్ వ్యాన్లు, ఈ- కామర్స్, పెద్ద రిటైల్ చైన్ సిస్టమ్ ద్వారా ‘భారత్ బ్రాండ్’ పేరుతో బియ్యం విక్రయించవచ్చని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికి బియ్యం కేటాయింపుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News
Updated Date - Aug 01 , 2025 | 03:48 AM