Business Loan Fraud: సంపన్నులే లక్ష్యంగా కోట్లలో దోపిడీ
ABN, Publish Date - Jul 19 , 2025 | 03:47 AM
సంపన్న వ్యాపార వర్గాలే లక్ష్యంగా రూ.కోట్లలో మోసాలకు పాల్పడుతున్న రొనాల్డ్ సల్దానా
వ్యాపార రుణాలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం
రూ.500 కోట్లు దోచుకున్న కేటుగాడు
సంపన్న వ్యాపార వర్గాలే లక్ష్యంగా వల
మంగళూరులో అరెస్టు చేసిన పోలీసులు
8 ఏళ్ల క్రితం కూలీ.. మోసాలతో కోట్లకు పడగలు
బెంగళూరు, జూలై 18(ఆంధ్రజ్యోతి): సంపన్న వ్యాపార వర్గాలే లక్ష్యంగా రూ.కోట్లలో మోసాలకు పాల్పడుతున్న రొనాల్డ్ సల్దానా(45) అనే వ్యక్తిని మంగళూరు నగర పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపారులకు రూ.600 కోట్ల వరకు అప్పులు ఇప్పించగల సత్తా ఉందని.. ప్రభుత్వంలోనూ మంచి పలుకుబడి ఉందని నమ్మించి ప్రాసెసింగ్ ఫీజులు, లీగల్ క్లియరెన్సుల పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.50 లక్షల నుంచి రూ.4 కోట్ల వరకు గుంజినట్టు పోలీసులు గుర్తించారు. దీంతోపాటు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల పేరిట కూడా మరికొందరిని మోసం చేసినట్టు తెలుసుకున్నారు. ఇలా.. రూ.500 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. మోసపూరితంగా పోగేసుకున్న సొమ్ముతో రొనాల్డ్ మాయామహల్ వంటి ఇంటిని నిర్మించుకున్నాడు. ఈ మోసాలపై ఫిర్యాదులు అందుకున్న మంగళూరు పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్ రెడ్డి తన బృందంతో.. స్వయంగా రంగంలోకి దిగి గురువారం అర్ధరాత్రి మాయామహల్‌పై ఆకస్మికంగా దాడులు చేసి.. అతనిని అరెస్టు చేశారు. 2016 వరకు కూలి పనులు చేసుకుని పొట్టపోసుకున్న సల్దానా.. ఆ తర్వాత ఎనిమిదేళ్ల కాలంలో అత్యంత సంపన్నుడిగా ఎదిగాడు. తనను తాను పారిశ్రామికవేత్తగా పరిచయం చేసుకుని, డబ్బున్నవారిపై వల విసిరేవాడు. వందలాది ఎకరాల భూములు, అదేస్థాయి రుణాలు కావాలంటే తనను సంప్రదించాలని చెప్పి నమ్మించేవాడు. తొలుత మంగళూరులోని జప్పినమగరు ప్రాంతంలోని తన ఇంటికి పిలిపించుకునేవాడు. అతడి నివాసం, విదేశీ బ్రాండ్ల మద్యం, విదేశీ యువతుల సేవలను చూసి బాగా పలుకుబడి ఉందని వచ్చినవారు నమ్మేవారు. ఇదే అదనుగా ఒక్కొక్కరికి రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల రుణం ఇప్పించేందుకు రూ.కోట్లలో ఫీజులు తీసుకున్నాడు. ఆ తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, పని కాలేదని, త్వరలో అవుతుందని వాయిదాలు వేయడం చేసేవాడు. ఇతని వ్యవహారాలపై పోలీసులకు ఫిర్యాదులు అందడంతో పలుమార్లు దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను ఇంటి సమీపంలోని అత్యాధునిక సీసీ కెమెరాల ద్వారా పసిగట్టి, రహస్య గదిలోకి వెళ్లి దాక్కునేవాడు. ఇలా పలుమార్లు తప్పించుకున్నాడు.
అంతా రహస్యమే!
మోసాలకు పాల్పడగా వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన సౌకర్యాలతో మాయామహల్‌ను నిర్మించుకున్నాడని, దీనిలో రహస్య గదులతోపాటు బాధితులు ఎవరైనా వచ్చి ఆందోళనకు దిగితే.. పారిపోయేందుకు రహస్య మార్గాలను కూడా ఏర్పాటు చేసుకున్నాడని పోలీసు కమిషనర్ వివరించారు. కేవలం మూడు నెలలకాలంలో రొనాల్డ్ బ్యాంకు ఖాతాలో రూ.40 కోట్లు వచ్చి చేరాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 19 , 2025 | 03:47 AM