Union Budget 2025 : కొత్త, పాత ఐటీ ట్యాక్స్ విధానానికి గల తేడాలు.. ప్రయోజనాలు ఇవే..
ABN, Publish Date - Feb 01 , 2025 | 05:58 PM
పన్ను నుంచి భారీ మినహాయింపులు ఇస్తూ మధ్యతరగతి వర్గానికి ఊరటనిచ్చే వార్త ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆదాయ పన్ను శ్లాబ్ పరిమితిని పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సవరించిన కొత్త ఆదాయపు పన్ను విధానానికి ఎలా మారాలి ప్రశ్నకు ఇక్కడ సమాధానం తెలుసుకుందాం..
ఉద్యోగులు ఎప్పటినుంచో కోరుకుంటున్న ప్రకటన ఇప్పుడు రానే వచ్చింది. ఆదాయపు పన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్లు ఈసారి బడ్జెట్‌లో వెల్లడించి మధ్యతరగతి ప్రజల కళ్లల్లో ఆనందం నింపింది కేంద్ర ప్రభుత్వం. సవరించిన ఆదాయపు పన్ను విధానం ప్రకారం వార్షిక ఆదాయం రూ.4లక్షల వరకూ ఉన్నవారికి ఇకపై ఎలాంటి పన్ను ఉండబోదు. రూ.12 లక్షల వరకూ ఆదాయపన్ను రహితంగా ఉండవచ్చు. ఈ నిర్ణయం ఫలితంగా దాదాపు కోటి మందికి పైగా ప్రజలు పన్ను మినాహాయింపు ప్రయోజనాలు పొందనున్నారు. కొత్త విధానం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఇప్పటివరకూ పాత విధానం ప్రకారం పన్నులు చెల్లిస్తున్నవారు కొత్త ఐటీ విధానానికి తప్పక మారాల్సి ఉంటుంది. మరి, సవరించిన ఆదాయపు శ్లాబ్‌కు ఎలా మారాలి అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం తెలుసుకుందాం.
కొత్త ఐటీ శ్లాబు, పాత ఐటీ శ్లాబుల వివరాలు..
0-రూ.4 లక్షల వరకు నో ట్యాక్స్ (గతంలో 0-రూ.3 లక్షలు వార్షికంగా)
రూ. 4 లక్షల - 8 లక్షల వరకు 5 శాతం (గతంలో 3-రూ.7 లక్షలు వార్షికంగా)
రూ. 8 లక్షల - 12 లక్షల వరకు 10 శాతం (గతంలో 7-రూ.10 లక్షలు వార్షికంగా)
రూ. 12 లక్షల - 16 లక్షల వరకు 15 శాతం (గతంలో 10-రూ.15 లక్షలు వార్షికంగా), ఏడాదికి 15 లక్షలకు పైగా ఆదాయంపై 30 శాతం పన్ను శ్లాబ్ రద్దు.
రూ. 16 లక్షల - 20 లక్షల వరకు 20 శాతం
రూ. 20 లక్షల - 24 లక్షల వరకు 25 శాతం
రూ. 24 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం ట్యాక్స్ విధింపు.
రూ.12 లక్షల వరకు ఆదాయం రహితంగా ఉండొచ్చు ఇలా?
బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారం రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుంది. పైనున్న పట్టికను గమనిస్తే, రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకూ ఆదాయం ఉన్న వారు కట్టిన పన్ను మొత్తం రాయితీ రూపంలో మళ్లీ తిరిగొస్తుంది. ఉదాహరణకు రూ.8లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారు పాత శ్లాబు ప్రకారం రూ.30వేలు చెల్లించేవారు. ఇప్పుడు రూ.20 వేలు చెల్లిస్తారు. రాయితీ రూపంలో ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తమూ రూ.20వేలు. ఇలా రూ.12లక్షల వరకూ ఆర్జించే వ్యక్తికి దక్కే రాయితీ రూ.80,000. రూ.16 లక్షల వార్షిక ఆదాయం ఉంటే రూ.12 లక్షలు - రూ. 16 లక్షల స్లాబ్‌లో 15 శాతం రేటు మొత్తం రూ. 1,20,000 పన్ను చెల్లించాలి. ఇది గతంలో కంటే రూ.50,000 తక్కువ. ఇక సంవత్సరానికి రూ.50లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి కొత్త విధానం ప్రకారం రూ. 10,80,000 ఆదాయపు పన్ను చెల్లిస్తాడు. గతంలో కంటే రూ. 1,10,000 తక్కువ.
మీరు పాత విధానం నుంచి కొత్త పన్ను విధానంలోకి మారాలంటే?
మీరు పాత విధానంలో ఎంత మినహాయింపును క్లెయిమ్ పొందారు, మీ ఆర్థిక ప్రొఫైల్ ఎలా ఉంది అనేదాని ఆధారంగా కొత్త ఐటీ విధానం ఎంచుకోవాలి. ఉదాహరణకు, మీ ఆదాయం రూ. 16 లక్షలు అనుకుందాం. మీరు రూ. 4 లక్షల మినహాయింపులను చూపిస్తే, మీ పన్ను విధించదగిన ఆదాయం రూ. 12 లక్షలు అవుతుంది. ఇప్పుడు, పాత పన్ను విధానం ప్రకారం మీరు మొత్తం రూ. 1,77,500 చెల్లిస్తారు. కొత్త విధానం కింద మీరు చెల్లించే దానికంటే రూ. 52,000 ఎక్కువ.
దీన్ని వివరంగా చూద్దాం:
మీ ఆదాయం: రూ.16 లక్షలు
మినహాయింపులు: రూ. 4 లక్షలు
పన్ను విధించదగిన ఆదాయం: రూ.16 లక్షలు - రూ. 4 లక్షలు = రూ.12 లక్షలు
పాత పన్ను విధానం: ఈ విధానంలో.. వేర్వేరు ఆదాయ స్థాయిలకు వేర్వేరు పన్ను రేట్లు ఉంటాయి. అయితే, రూ. 12 లక్షల ఆదాయానికి పన్ను లెక్కింపు ఇలా ఉంటుంది.
మొదటి రూ. 2.5 లక్షలకు పన్ను లేదు.
తదుపరి రూ. 2.5 లక్షలపై 5 శాతం పన్ను.
ఆ తర్వాత రూ. 5 లక్షలపై 20 శాతం పన్ను.
ఇంకా ఎక్కువ ఆదాయంపై 30 శాతం పన్ను.
ఈ విధంగా లెక్కించినట్లైతే.. ఆ మొత్తం పన్ను రూ.1,72,500 అవుతుంది. కొత్త పన్ను విధానంలో.. తక్కువ పన్ను రేట్లు ఉంటాయి. కానీ చాలా మినహాయింపులు ఉండవు అని గుర్తుంచుకోవాలి. రూ.12 లక్షల ఆదాయానికి పన్ను లెక్కింపు వేరే విధంగా ఉంటుంది. కొత్త విధానంలో పన్ను తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు రూ. 52,000 ఆదా చేసుకోవచ్చు. కాబట్టి, మీ ఆదాయం రూ.16 లక్షలు.. మినహాయింపులు రూ. 4 లక్షలు అయితే.. కొత్త పన్ను విధానం పాత విధానం కంటే మీకు లాభదాయకం అని చెప్పవచ్చు.
గమనిక : (ప్రస్తుత పన్ను రేట్లు మారే అవకాశం ఉంది కాబట్టి, ఖచ్చితమైన సమాచారం కోసం ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ చూడటం మంచిది. మేము కేవలం ఉదాహరణ కోసం కొన్ని వివరాలు ఇస్తున్నాము.)
Updated Date - Feb 01 , 2025 | 07:40 PM