Accountant: రూ. 500 లంచం.. 30 ఏళ్ల తర్వాత రైతుకు న్యాయం..
ABN, Publish Date - Jun 21 , 2025 | 07:18 PM
Accountant: ఆ తర్వాత లక్ష్మణ్ నుంచి నగేష్ 500 రూపాయలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. 2006లో బెలగావి స్పెషల్ కోర్టు నగేష్‌ను దోషిగా తేల్చింది.
కొన్ని సార్లు న్యాయం జరగటం లేటు కావచ్చు.. కానీ, జరగటం మాత్రం పక్కా. ఇందుకు కర్ణాటకలో చోటుచేసుకున్న ఓ రైతు సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. 30 ఏళ్ల క్రితం ఆ రైతును ఓ ప్రభుత్వ అధికారి లంచం అడిగాడు. ఈనేపథ్యంలోనే లోకాయుక్త అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అయితే, 30 ఏళ్ల నుంచి అతడి లంచం కేసు కోర్టుల్లో నడుస్తూ ఉంది. తాజాగా, న్యాయం గెలిచింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అతడ్ని దోషిగా తేల్చింది. ఆ ప్రభుత్వ అధికారి జైలు పాలయ్యాడు.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 1995 సంవత్సరంలో కర్ణాటకలోని కొడలికి చెందిన లక్ష్మణ్ రుక్కన్న కటంబలే అనే రైతు అతడి తమ్ముడు పొలం పంచుకున్నారు. పంచుకున్న పొలాలను ఎవరి పేరు మీద వాళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి గ్రామ అకౌంటెంట్ నగేష్ దగ్గరకు వెళ్లారు. అయితే, పొలాన్ని వారి పేర్ల మీదకు ట్రాన్స్‌ఫర్ చేయడానికి లంచం ఇవ్వాలని నగేష్ అన్నాడు. దీంతో లక్ష్మణ్ లోకాయుక్తకు వెళ్లాడు. నగేష్‌పై ఫిర్యాదు చేశాడు.
ఆ తర్వాత లక్ష్మణ్ నుంచి నగేష్ 500 రూపాయలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. 2006లో బెలగావి స్పెషల్ కోర్టు నగేష్‌ను దోషిగా తేల్చింది. ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా విధించింది. దీంతో అతడు కర్ణాటక హైకోర్టుకు వెళ్లాడు. కర్ణాటక కోర్టు అతడ్ని నిర్ధోషిగా తేలుస్తూ 2012లో తీర్పు నిచ్చింది.
ఈ నేపథ్యంలోనే లోకాయుక్త సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2025 ఏప్రిల్ 16వ తేదీన సుప్రీంకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. దీంతో నగేష్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. తాజాగా, అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత రైతు లక్ష్మణ్‌కు న్యాయం జరిగింది.
ఇవి కూడా చదవండి
తప్ప తాగి ఒంటెపై సవారీ.. మృత్యు దారిలో పరుగో పరుగు..
2 నెలలుగా కనిపించని మహిళ.. ఇంటి ముందు గొయ్యి తవ్వి చూస్తే..
Updated Date - Jun 21 , 2025 | 08:38 PM