Rafale jets: పాక్ గొప్పలన్నీ తప్పులే
ABN, Publish Date - May 05 , 2025 | 05:06 AM
భారత్‌పై పాక్ వైమానిక దాడి జరగొచ్చని అనుమానాలతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే భారత్ వద్ద ఉన్న రాఫెల్, మిటియార్ క్షిపణుల విజయవంతమైన కాంబినేషన్‌తో గగనతల యుద్ధంలో పైచేయి సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పీఎల్15 క్షిపణులపై దాయాదిదేశం ఆర్భాటపు ప్రచారం
వాటి రేంజ్ 200-300 కిలోమీటర్లు ఉంటుందని, భారత్ వైమానిక దాడులను తిప్పికొట్టగలమని డంబాలు
వాటి వాస్తవ రేంజ్ 120 కిలోమీటర్లే అంటున్న నిపుణులు
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. ‘భారత్ మాపై దాడి చేయడం తథ్యం’ అని పాకిస్థాన్ భావిస్తున్న సంగతి తెలిసిందే! పుల్వామా దాడి అనంతరం భారత్ చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడులను పరిగణనలోకి తీసుకుంటే.. ఈసారి కూడా ప్రధానంగా వైమానిక దాడులు చేసే అవకాశమే ఎక్కువని అంచనా. పాక్ రక్షణ మంత్రి ఖవాజా సైతం.. భారత వాయుసేనతో ఘర్షణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే గతానికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే.. ఇప్పుడు భారత్ వద్ద అత్యంత అధునాతనమైన రాఫెల్ విమానాలు ఉన్నాయి. వీటి ద్వారా మిటియార్ క్షిపణులను ప్రయోగించవచ్చు. వీటి రేంజ్ దాదాపు 150 కిలోమీటర్లు. ఈ దాడులను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న పాకిస్థాన్.. చైనీస్ పీఎల్-15 క్షిపణులను పెద్ద సంఖ్యలో సమకూర్చుకుంటోంది. ఇప్పటికే దాదాపు 100 మిస్సైల్స్ దాకా కొన్నట్టు సమాచారం. ఇవి ఎయిర్ టు ఎయిర్ మిస్సైళ్లు. అంటే విమానం నుంచి విమానాలపైకి ప్రయోగించే క్షిపణులు. వీటి రేంజ్ 200 నుంచి 300 కిలోమీటర్ల దాకా ఉంటుందని అంచనా. ఈ మిస్సైల్స్‌ను పాక్ వద్ద ఉన్న రెండు విమానాల ద్వారా ప్రయోగించవచ్చు. ఒకటి.. జే10సి. ఇది కొంతవరకూ రాఫెల్‌తో పోటీపడగలిగిన విమానం. రెండు.. చైనా, పాకిస్థాన్ కలిసి తయారుచేసిన జేఎఫ్ 17 జెట్లు. పాక్ వద్ద జే10సీ విమానాలు 20 నుంచి 25 దాకా ఉన్నట్టు సమాచారం.
జేఎఫ్-17 యుద్ధవిమానాలైతే పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి (పీఎల్-15 క్షిపణిని డిప్లాయ్ చేసిన జేఎఫ్17 యుద్ధవిమానంతో సహా పలు ఫైటర్ జెట్లతో కూడిన 3 నిమిషాల వీడియోను పాక్ వాయుసేన ఇటీవల విడుదల చేసింది). ఒకవేళ రాఫెల్‌తో భారత్ వైమానిక దాడులు చేస్తే.. మన విమానాలను పాకిస్థాన్ పీఎల్-15 క్షిపణులతో చాలా ముందుగానే కొట్టేయవచ్చనే ప్రచారాన్ని పాకిస్థాన్‌లో విస్తృతంగా చేస్తున్నారు. కానీ.. ఇక్కడ రెండు సమస్యలున్నాయి. ఒకటి యుద్ధవిమానాల రాడార్ డిటెక్షన్ రేంజ్. క్షిపణుల రేంజ్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన సరిపోదని.. ఆ క్షిపణులను ప్రయోగించడానికి వాడే విమానాల్లోని రాడార్ల డిటెక్షన్ రేంజ్ కూడా ఎక్కువగా ఉండాలని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. జే10సీ విమానాల్లో ఆ రేంజ్ ఎక్కువేగానీ.. జేఎఫ్17 విమానాల్లో తక్కువగా ఉంటుందని వారు వివరిస్తున్నారు. ఈ జేఎఫ్17 విమానాల్లో కూడా.. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అనే మూడు రకాలుంటాయి. వాటిలో బ్లాక్ 1, బ్లాక్ 2 అసలు ఈ క్షిపణులను ప్రయోగించలేవు. బ్లాక్ 3 రాడార్ డిటెక్షన్ రేంజ్ 140-150 కిలోమీటర్ల దాకా ఉంటుందని అంచనా. అంటే ప్రత్యర్థి విమానం అంత దగ్గర్లోకి వస్తే తప్ప దాన్ని గుర్తించి, మిస్సైల్‌ను ప్రయోగించలేవు.
ఇక రెండో సమస్య.. పాకిస్థాన్ కొంటున్న పీఎల్-15 క్షిపణులు ‘ఒరిజినల్ చైనీస్’ రకం కావు. అవి వేరే దేశాలకు ఎగుమతి చేయడానికి చైనా ప్రత్యేకంగా తయారుచేసే ఎక్స్‌పోర్ట్ రకం (పీఎల్15 ఈ) క్షిపణులు. ఒరిజినల్ చైనీస్ క్షిపణుల కన్నా వీటి రేంజ్ తక్కువ. ఈ రెండు అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటే.. జేఎఫ్17 ద్వారా ప్రయోగించే పీఎల్-15 మిస్సైళ్ల వాస్తవ రేంజ్ 120 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని.. అంతకు మించి ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అదేసమయంలో.. మన మిటియార్ క్షిపణుల ‘నో ఎస్కేప్ జోన్’ చాలా ఎక్కువని కూడా వారు గుర్తుచేస్తున్నారు. అంటే.. మిటియార్‌కి దొరికిన ప్రత్యర్థి విమానం తప్పించుకోవడం చాలా చాలా కష్టం. దీనికితోడు.. మన వద్ద ఉన్న ఎస్‌యు30 ఎంకేల ద్వారా అస్త్ర 1, అస్త్ర 2 క్షిపణులు ప్రయోగించి పాకిస్థాన్ విమానాలను సులభంగా ఎదుర్కోవచ్చని.. గగనతల యుద్ధంలో భారత్‌దే పైచేయి అవుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.
- ‘ఆంధ్రజ్యోతి’ రక్షణ ప్రత్యేక ప్రతినిధి
ఇవి కూడా చదవండి
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
For National News And Telugu News
Updated Date - May 05 , 2025 | 09:33 AM