Air India: ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో భార్యాభర్తల ఫైట్.. మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడంతో..
ABN, Publish Date - Jun 29 , 2025 | 11:18 AM
శనివారం ఓ ఎయిర్ ఇండియా విమానంలో భార్యాభర్తలు తగవు పడ్డారు. ఈ క్రమంలో మహిళ భర్త మరో ప్యాసెంజర్‌తో కూడా దురుసుగా వ్యవహరించడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అమృత్‌సర్-ఢిల్లీ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియా విమానంలో భార్యాభర్తలు తగవు పడ్డ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మరో ప్యాసెంజర్ ఫిర్యాదు మేరకు.. భార్యతో గొడవ పడ్డ వ్యక్తిని ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అమృత్‌సర్-ఢిల్లీ విమానంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఏఐ 454 ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది. విమానం ల్యాండయ్యేందుకు సిద్ధమవుతున్న సమయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం మొదలైంది. ఇద్దరి గొడవను చూసి మరో ప్యాసెంజర్ వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మహిళ భర్త.. ప్యాసెంజర్‌తో తగవుకు దిగాడు. వీరి గొడవ పతాకస్థాయికి చేరడంతో విమానం క్రూ సదరు ప్యాసెంజర్‌ను బిజినెస్ క్లాస్‌లోకి మార్చాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో ధ్రువీకరించింది.
‘ల్యాండింగ్‌లో సిద్ధమవుతున్న సమయంలో మహిళ భర్త సీట్ల మధ్య నడవాలో నిలబడి మరో ప్యాసెంజర్‌తో తగవుకు దిగారు. ఈ విషయం క్యాబిన్ క్రూ దృష్టికి రావడంతో వారు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. రెండో ప్యాసెంజర్‌ను బిజినెన్ క్లాస్‌లోకి పంపించారు. ఈ మేరకు మహిళ భర్తపై రెండవ ప్యాసెంజర్ ఫిర్యాదు చేయడంతో పైలట్ ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. విమానం ఢిల్లీలో దిగాక వారు మహిళ భర్తను అదుపులోకి తీసుకున్నారు’ అని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
విమానంలో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ప్రవర్తనను తాము అస్సలు సహించబోమని ఎయిర్ ఇండియా పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొంది. ఈ విషయంలో దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
ఏడేళ్లుగా యాంటీ ఏజింగ్ ఔషధాలు.. నటి షఫాలీ మృతికి ఇవే కారణమా
పాక్‌కు కీలక సమాచారం లీక్.. నేవీ ప్రధాన కార్యాలయం ఉద్యోగి అరెస్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 29 , 2025 | 11:28 AM