Indians Evacuated: రంగంలోకి కేంద్రం.. ఇరాన్ నుంచి భారత్‌కు 110 మంది విద్యార్థుల తరలింపు
ABN, Publish Date - Jun 19 , 2025 | 08:09 AM
ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. తొలి విడతలో భాగంగా సుమారు 110 మంది విద్యార్థులు బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో 90 మంది జమ్మూ కశ్మీర్‌కు చెందిన వారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ఆపరేషన్ సింధు ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలి విడతలో 110 మంది విద్యార్థులు బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. వీరిలో 90 మంది జమ్ముకశ్మీర్‌కు చెందిన వారు. ఉర్మియా మెడికల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఆర్మేనియా, దోహా మీదుగా భారత్‌కు చేరుకున్నారు. ఇరాన్‌లో ప్రస్తుతం సుమారు 13 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో అత్యధికులు అక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.
విద్యార్థుల తరలింపు నేపథ్యంలో జమ్ము కశ్మీర్ స్టూడెంట్ అసోసియేషన్.. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇతర విద్యార్థులు కూడా త్వరగా స్వదేశానికి చేరుకుంటారని ఆశిస్తున్నట్టు వెల్లడించింది. ఇక విద్యార్థుల కోసం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు విమాన ప్రయాణ ఖర్చులు కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని స్టూడెంట్ అసోసియేషన్ పేర్కొంది. ఇరాన్‌లోని భారతీయుల సహాయార్థం అక్కడి భారతీయ ఎంబసీ ఇప్పటికే హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేసింది. తక్షణం ఇరాన్‌ను వీడాలని విజ్ఞప్తి చేసింది.
ఇక ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలు 7వ రోజుకు చేరుకున్నాయి. గతవారం ఇజ్రాయెల్.. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇరాన్ అణు స్థావరాలపై దాడుల తరువాత ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఇజ్రాయెల్‌పై ప్రతి దాడులకు దిగిన ఇరాన్ పలు నగరాలపై మిసైళ్ల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 20కి పైగా ఇజ్రాయెలీలు మృతి చెందగా వందల మంది గాయపడ్డారు.
బుధవారం ఇజ్రాయెల్.. టెహ్రాన్‌పై యుద్ధ విమానాలతో దాడులు చేసింది. ప్రజలు రాజధానిని వీడాలని తేల్చి చెప్పింది. అనంతరం, ఓ అణుస్థావరంపై కూడా దాడి చేసింది. ప్రతిగా ఇరాన్ హైపర్ సానిక్ మిసైళ్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. ఇరాన్ లొంగిపోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌ను సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమైనీ తోసిపుచ్చారు. తమపై దాడులకు దిగితే అమెరికా కోలుకోలేని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇక ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో తమ పాత్ర ఏమీ లేదని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, తన సహనం రోజురోజుకూ తగ్గిపోతోందని అన్నారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని త్యజించాలంటూ ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగుతున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
27 ఏళ్ల క్రితం ఎయిర్ ఇండియా తరహా ప్రమాదం.. ప్రాణాలు దక్కించుకున్న 11ఏ సీటు ప్యాసెంజర్
కమల్ కౌర్ హత్య.. పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 19 , 2025 | 08:22 AM