Benefits of Saying No:'No' చెప్పడం అలవాటు చేసుకుంటే ఇన్ని లాభాలా..!
ABN, Publish Date - Jul 12 , 2025 | 08:58 PM
మొహమాటం కొద్దో.. భయంతోనో వ్యక్తిగతంగా, వృత్తిగతంగా కొన్ని సందర్భాల్లో 'No' చెప్పేందుకు వెనుకాడితే ఊహించని పరిణామాలు కచ్చితంగా ఎదురవుతాయి. అందుకే ఈ విషయాల్లో వద్దు, కాదు, కుదరదు అని తెగేసి చెప్పడం అలవాటు చేసుకుని తీరాల్సిందే..
Why Saying No is Important: ఈ చిన్ని జీవితం ఏ క్షణంలో ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం ఎవరి తరం కాదు. అద్భుతం జరగబోతోంది అనుకునేంతలోనే ఊహించని విధంగా దురదృష్టం కాటేయవచ్చు. కానీ, ఈ రోజు మనం చేసే పనులు మన భవిష్యత్తును నిర్దేశిస్తాయన్నది ముమ్మటికీ ఒప్పుకుని తీరాలి. జీవిత పయనంలో లెక్కకు మిక్కిలి వ్యక్తులు పరిచయం అవుతుంటారు. ఒక్కో మజిలీలో కొందరితో అనుబంధం ఏర్పడుతుంది. జీవితాంతం తోడుండేది మాత్రం కొందరే. అది తెలిసీ పరిచయం ఉన్నవారని అడిగినవాటికల్లా సరేనంటూ వెళడం ఏమాత్రం సమంజసం కాదు. ఉదాహరణకు స్నేహితులు, సన్నిహితులు, పరిచయస్థులు ఎవరైనా మిమ్మల్ని సహాయం చేయమని అడగవచ్చు. అలాంటి సమయంలో ఇతరులు ఏమనుకుంటారో అని భయపడి ప్రతిదానికీ అవును అని తలాడిస్తే మాత్రం తీరని నష్టం భరించక తప్పదు. ఈ విషయంలోనే కాదు. మొహమాటానికి పోయి ఈ కింది సందర్భాల్లో సరే అన్నారంటే మాత్రం అంతేసంగతులు. అందుకే 'నో' చెప్పడం అలవాటు చేసుకోండి. ఆ మార్పును కచ్చితంగా ఆస్వాదిస్తారు.
'No' అలవాటు ఎందుకు ముఖ్యం?
పని విషయమైనా, వ్యక్తిగత విషయమైనా ఎవ్వరైనా మీ సాయం కోరి వస్తే ప్రతిసారీ 'YES' అనాల్సిన అవసరం లేదు. మీ స్థోమత, స్థితిగతులు అన్నీ అంచనా వేసుకున్న తర్వాతే ఆలోచించి నిర్ణయానికి రావాలి. తలకుమించిన భారం తెలిసి తెలిసీ మీద వేసుకుంటే తిప్పలు తప్పవు. అందుకే జీవితంలో క్లిష్టమైన సందర్భాల్లో 'No' చెప్పడం అలవాటు చేసుకోండి. దీని వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరులు మిమ్మల్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా ఉంటారు.
'No' చెప్తే కలిగే లాభాలు
విలువ
ప్రతిదానికీ అవును అని చెప్పడం మంచి అలవాటు కాదు. మీ సౌలభ్యాన్ని బట్టి నడుచుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వాలి. తాహతుకు మించి ఏ పనిలోనూ తలదూర్చకూడదు. ఈ అలవాటు నలుగురిలో మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఆత్మసంతృప్తిని అందిస్తుంది.
ఒత్తిడి
మీకు ఊపిరసలపనంత పని ఉంటుంది లేదా పనిచేసి అప్పటికే అలసిపోయి ఉంటారు. ఈలోగా ఎవరైనా వచ్చి నా కోసం ఈ పని చేయగలరా అని అడిగితే మీరు అవును అని ఎట్టి పరిస్థితుల్లో అనకండి. ఇది మీపై ఒత్తిడిని పెంచుతుంది. ఓపిక లేని సందర్భాల్లో, నిస్సహాయ పరిస్థితుల్లో కాదు అని చెప్పడం తప్పు కాదని గుర్తుంచుకోండి.
ఆత్మవిశ్వాసం
ప్రతిదానికీ సరే అందాంలే అనే ధోరణితో నడుచుకుంటే మీకే నష్టం. కొన్ని సందర్భాల్లో కాదు అని చెప్పినపుడే మీరేంటో మీకు అర్థమవుతుంది. ఈ ఒక్క అలవాటు స్వంత నిర్ణయాలు తీసుకునేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుందంటే నమ్ముతారా.. వద్దు అనే ధోరణి ఉన్నవారిలోనే ఆత్మవిశ్వాసం అధికమని తెలుసుకోండి.
గౌరవం
మీరు ఇదీ అని వ్యక్తులకు మీ అలవాట్ల ద్వారా స్పష్టంగా తెలియజెప్పేందుకు ప్రయత్నించండి. అప్పుడు మీ జీవితం ఇంకొకరి నియంత్రణలో ఉండదు. ముఖ్యంగా మిమ్మల్ని అలుసు తీసుకుని లేదా చేతకాని వాళ్ల కింద జమకట్టే అవకాశం అవతలివాళ్లకి ఇవ్వకూడదంటే.. నో చెప్పండి.
ఇవి కూడా చదవండి:
ఫోన్ పోగొట్టుకున్నారా.. వెంటనే ఈ ఐదు పనులు చేయండి
సౌతిండియా చుట్టేందుకు గొప్ప ఛాన్స్.. IRCTC 13 రోజుల ఆధ్యాత్మిక యాత్ర..
మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 12 , 2025 | 09:00 PM