H-1b Visa: హెచ్-1బీ వీసాకు చెక్ పెట్టే చట్టాన్ని తెస్తాను.. అమెరికా కాంగ్రెస్ సభ్యురాలి ప్రకటన
ABN, Publish Date - Nov 14 , 2025 | 10:54 PM
హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌కు ముగింపు పలికేలా కొత్త బిల్లును తీసుకొస్తానని అమెరికా చట్టసభల సభ్యురాలు మార్జరీ టేలర్ గ్రీన్ పేర్కొన్నారు. అమెరికా ఉద్యోగాలను విదేశీయులతో భర్తీ చేసే విధానానికి ముగింపు పలకాలని స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా చట్టసభల సభ్యురాలు, రిపబ్లికన్ నేత మార్జరీ టేలర్ గ్రీన్ (Marjorie Taylor Greene) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌కు ముగింపు పలికే బిల్లును సభలో ప్రవేశపెడతానని అన్నారు. ఈ వీసాను పూర్తిగా తొలగించేలా బిల్లు తేవడమే తన లక్ష్యమని తాజాగా మీడియాకు తెలిపారు. టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇంజినీరింగ్ రంగాల్లో అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీయులతో భర్తీ చేస్తున్న ఈ వీసా విధానానికి ముగింపు పలుకుతానని స్పష్టం చేశారు (H-1b Bill US Congress).
ప్రముఖ టెక్ సంస్థలు, ఏఐ సంస్థలు, ఆసుపత్రులు హెచ్-1బీ వీసా వ్యవస్థను దుర్వినియోగపరిచాయని అన్నారు. అమెరికన్ ఉద్యోగులను తక్కువ శాలరీ తీసుకునే వ్యక్తులతో భర్తీ చేశాయని ఆరోపించారు.
తను తీసుకొచ్చే బిల్లుతో అమెరికాకు కీలకమైన రంగాల్లో స్థానిక వర్కర్లకు తొలి ప్రాధాన్యం దక్కుతుందని అన్నారు. రాబోయే తరానికి అమెరికా కల సాకారం కావాలంటే వారి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించాలని స్పష్టం చేశారు.
గ్రీన్ ప్రతిపాదించిన బిల్లులో డాక్టర్లు, నర్సుల విషయంలో మినహాయింపు ఇచ్చారు. ఈ వృత్తుల వారికి ఏటా 10 వేల హెచ్-1బీ వీసాలు ఇచ్చేలా మినహాయింపును బిల్లులో పేర్కొన్నారు. అయితే, దీన్ని కూడా 10 ఏళ్ల తరువాత రద్దు చేస్తామని ఆమె తెలిపారు. దేశీయంగా డాక్టర్లు, నర్సుల లభ్యత పెరిగే వరకూ ఈ మినహాయింపు తప్పదని అన్నారు. అమెరికాకు విదేశీ నిపుణుల అవసరం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న మరుసటి రోజే గ్రీన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇక విదేశీ నిపుణులతో అమెరికాలోని వర్కర్లకు శిక్షణ ఇప్పించే దిశగా హెచ్-1బీ వీసా విధానంలో మార్పులు ఉంటాయన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
ట్రంప్ కటాక్షం కోసం లాబీయింగ్.. పాక్ ఎంత ఖర్చు పెట్టిందో తెలిస్తే..
చైనాలో నేపాల్ కరెన్సీ నోట్ల ప్రింటింగ్.. 17 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 14 , 2025 | 11:01 PM