Pak Lobbying With US: ట్రంప్ కటాక్షం కోసం లాబీయింగ్.. పాక్ ఎంత ఖర్చు పెట్టిందో తెలిస్తే..
ABN , Publish Date - Nov 14 , 2025 | 06:22 PM
అమెరికా దృష్టి తమపై పడేలా లాబీయింగ్ చేయించుకునేందుకు పాక్ ఏకంగా 5 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ట్రంప్ సర్కారు కటాక్షం కోసం పాక్ ఏకంగా ఆరు సంస్థలతో అగ్రిమెంట్స్ కుదుర్చుకుందట. ఫలితంగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ట్రంప్‌తో సమావేశం కాగలిగారట.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు యావత్ ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్నాయి. మిత్రులు, ప్రత్యర్థులు అన్న తేడా లేకుండా అందరూ సుంకాల ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, పాక్ మాత్రం అనూహ్య రీతిలో ట్రంప్ సర్కారు అభిమానం పొందింది. పలు ప్రయోజనాలను కూడా సాధించుకుంది. ఈ దిశగా తెర వెనుక భారీ స్థాయిలో లాబీయింగ్ నడిచిందని, ఇందుకోసం పాక్ బాగానే ఖర్చుపెట్టిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి (Pak Spends 5 Million Dollars for Lobbying With US).
ట్రంప్ సర్కారుతో లాబీయింగ్ కోసం పాక్ ప్రభుత్వం ఏకంగా 5 మిలియన్ డాలర్ల మేర ఖర్చు పెట్టింది. ట్రంప్ సన్నిహితులకు చెందిన ఆరు లాబీయింగ్ సంస్థలతో ఈ మేరకు కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఈ ప్రయత్నాలకు మంచి ఫలితాలే దక్కాయని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. సైడెన్ లా ఎల్ఎల్‌పీ అండ్ జావెలిన్ ఎడ్వైజర్స్ సంస్థ లాబీయింగ్ ఫలితంగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఏకంగా శ్వేత సౌధంలో ట్రంప్‌తో సమావేశం కాగలిగారు. అంతకుముందు నాలుగు సంవత్సరాల్లో అధ్యక్షుడు బైడెన్ పాక్ నేతలతో కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేదు. ఇక ఆర్కిడ్ అడ్వైజర్స్‌తో కుదిరిన ఒప్పందం వల్ల పాక్‌పై అమెరికా సుంకాలు 29 శాతం నుంచి 19 శాతానికి తగ్గాయట.
ఈ లాబీయింగ్ ఫలితంగా పాక్, అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. పాక్‌లో విలువైన ఖనిజాల వెలికితీతకు అమెరికాతో 500 మిలియన్ డాలర్ల డీల్ కుదిరింది. టారిఫ్‌ల తగ్గింపు కోసం ఒక సంస్థ, ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధాల బలోపేతానికి మరో సంస్థ పాక్ తరపున లాబీయింగ్‌కు దిగిందని విశ్లేషకులు కామెంట్ చేశారు. ఆ తరువాతే సుంకాలు తగ్గడంతో పాటు ఖనిజాల వెలికితీతకు ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు. లాబీయింగ్ కోసం భారత్ కంటే పాక్ మూడు రెట్లు ఎక్కువగా డబ్బులు వెదజల్లిందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
చైనాలో నేపాల్ కరెన్సీ నోట్ల ప్రింటింగ్.. 17 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి