Pak Nationwide Protests: పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ABN , Publish Date - Nov 09 , 2025 | 03:52 PM
పాక్ ఆర్మీ చీఫ్ అధికారాలను మరింత విస్తృత పరిచేందుకు రాజ్యాంగ సవరణను ప్రతిపాదించిన షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా నిరసనలకు తెరతీశాయి. రిటైర్మెంట్ తరువాత కూడా ఆర్మీ చీఫ్‌పై కేసు పెట్టే వీలులేకుండా ప్రభుత్వం ఈ రాజ్యాంగ సవరణను ప్రతిపాదించింది.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌కు అపరిమిత అధికారాలు కట్టబెట్టేలా రాజ్యాంగ సవరణకు సిద్ధమైన షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆదివారం నిరసన కార్యక్రమాలకు దిగాయి. ప్రభుత్వ చర్యలతో రాజ్యాంగ పునాదులు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాయి (Nationwide protests by Pak Oppostion).
పాక్‌లోని రాజ్యాంగబద్ధ వ్యవస్థల అధికారాలు, రక్షణలను సమూలంగా మార్చేలా పాక్ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది. దీని ప్రకారం, సైన్యం, నావికాదళం, ఎయిర్‌ఫోర్స్‌కు అధిపతిగా ఆర్మీ చీఫ్‌ను నియమించేలా ప్రత్యేక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ (సీడీఎఫ్) పదవిని ఏర్పాటు చేయనున్నారు. ఫీల్డ్ మార్షల్ స్థాయి అధికారికి ఈ పదివిని కేటాయిస్తారు. అంటే, పార్లమెంటు ఆమోదం అనంతరం ప్రస్తుత ఫీల్డ్ మార్షల్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్.. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు కూడా అధిపతిగా మారుతారు. ఇక సీడీఎఫ్‌గా చేసిన వారిపై పదవీ విరమణ తరువాత ఎలాంటి దర్యాప్తూ చేపట్టకుండా జీవితకాల రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో, పాక్‌లో ప్రతిపక్షాల ఆగ్రహం ఆకాశాన్నంటింది (Pro Army Chief-Legislation Constitutional Amedment).
‘ఈ ముసాయిదా సవరణ చట్టంగా మారితే ఫీల్డ్ మార్షల్ మునీర్‌కు జీవితకాల రక్షణ లభిస్తుంది. ఆయనపై కేసు పెట్టేందుకు ఎలాంటి అవకాశం ఉండదు. ఎన్నో తప్పులు చేసి భయపడిపోతున్న ఆసిమ్ మునీర్ తన చుట్టూ తానే ఓ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశానికి అన్యాయం చేసినందుకు దోషిగా నిలబడాల్సి వస్తుందని భయపడుతున్నారు. అందుకే జీవితకాల రక్షణను ఏర్పాటు చేసుకుంటున్నారు’ అని పీటీఐ పార్టీ ప్రతినిధి ఒకరు మీడియాతో మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి:
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ కన్నుమూత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి