Trump Endorses Vivek: ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:54 AM
ఒహాయో గవర్నర్ ఎన్నికల బరిలో నిలిచిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామికి డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన అద్భుతమైన గవర్నర్‌గా రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తారని హామీ కూడా ఇచ్చారు. వివేక్‌కు మద్దతుగా ఉండాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల మూడు అమెరికా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తులు గెలుపొందిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్రమత్తమయ్యారు. ఒహాయో గవర్నర్ ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ నేత, భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామికి తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన సమ్‌థింగ్ స్పెషల్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. వివేక్‌కు అండగా ఉండాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఒహాయోలో ఇప్పటికే వివేక్ తన సత్తా చాటారని గుర్తు చేశారు. వివేక్‌పై ట్రంప్ మద్దతుదారులు కొందరు జాత్యాహంకారం ప్రదర్శిస్తున్న తరుణంలో ఈ పోస్టు ఆసక్తికరంగా మారింది (Trump Endorses Vivek Ramaswamy).
వివేక్‌పై ప్రశంసలు కురిపిస్తూ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఈ పోస్టు పెట్టారు. ‘నాకు వివేక్ బాగా తెలుసు. అధ్యక్ష ఎన్నికల్లో నాతో పోటీ పడ్డారు. అతడు యువకుడు.. చాలా స్మార్ట్. మన దేశమంటే ఆయనకు నిజంగా ఎంతో ఇష్టం’ అని ప్రశంసలు కురిపించారు.
ఒహాయో గవర్నర్ పదవికి పోటీ పడుతున్న వివేక్‌కు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు. ‘మీ రాష్ట్ర గవర్నర్‌గా వివేక్.. ఆర్థికాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారు. పన్నులు తగ్గించేందుకు, నిబంధనలను సరళతరం చేసేందుకు, మేడ్ ఇన్ యూఎస్ఏ విధానాన్ని ప్రోత్సహించేందుకు శ్రమిస్తారు’ అంటూ స్పష్టంగా తన మద్దతు తెలిపారు (Ohio Governor Race).
ఇంధన రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు, సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు వివేక్ కృషి చేస్తారని హామీ ఇచ్చారు. నేరాల నిర్మూలన, మిలిటరీ సిబ్బంది కోసం సంక్షేమ చర్యలు, లా అండ్ ఆర్డర్, ఎన్నికల వ్యవస్థ సమగ్రతను వివేక్ కాపాడతారని తెలిపారు. అమెరికా రాజ్యాంగంలోని రెండో అమెండ్‌మెంట్‌కు (తుపాకీని కలిగి ఉండే హక్కు) రక్షణగా నిలుస్తారని కూడా ట్రంప్ చెప్పారు. అమెరికన్లను వివేక్ ఎప్పుడూ నిరాశ పరచరని హామీ ఇచ్చారు. ఒహాయోకు అద్భుత గవర్నర్‌గా వివేక్ నిలుస్తారని తాను స్వయంగా హామీ ఇస్తున్నానని అన్నారు.

ఇవి కూడా చదవండి:
డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ కన్నుమూత
ఐదుగురు భారతీయుల కిడ్నాప్.. అల్ ఖైదా అనుబంధ ఉగ్రమూకల దారుణం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి