Israeli Soldier Attack: వెస్ట్ బ్యాంక్‌లో షాకింగ్ ఘటన.. రోడ్డు పక్కన నమాజ్ చేస్తున్న వ్యక్తిని..
ABN, Publish Date - Dec 27 , 2025 | 12:18 PM
వెస్ట్ బ్యాంక్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వెస్ట్ బ్యాంక్‌లో రోడ్డు పక్కన నమాజ్ చేసుకుంటున్న ఓ వ్యక్తిని ఇజ్రాయెలీ సెట్లర్ ఒకరు తన ఏటీవీ వాహనంతో ఢీకొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: వెస్ట్ బ్యాంక్‌లో గురువారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నమాజ్ చేసుకుంటున్న పాలస్తీనా వ్యక్తిని ఇజ్రాయెలీ రిజర్వ్ సైనిక దళానికి చెందిన ఓ వ్యక్తి తన ఏటీవీ వాహనంతో ఢీకొట్టాడు. దీంతో, బాధితుడు ఒక్కసారిగా పక్కకు పడిపోయాడు. ఆ తరువాత పాలస్తీనా వ్యక్తిపై నిందితుడు నోరుపారేసుకున్నాడు. ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని గద్దించాడు. ఘటన సమయంలో ఇజ్రాయెలీ వ్యక్తి సివిల్ దుస్తుల్లో ఉన్నాడు. అతడి వద్ద ఆయుధం కూడా ఉంది. ఈ విషయాన్ని ఇజ్రాయెలీ మిలిటరీ ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించిన షాకింగ్ ఫుటేజీ తమకు అందిందని పేర్కొంది. ఆ సైనికుడు తన అధికారాన్ని దుర్వినియోగ పరిచాడని, తీవ్ర ఉల్లంఘనకు పాల్పడ్డాడని పేర్కొంది (Israeli Reservist Soldier Attack with ATV).
ఈ ఘటనపై బాధితుడి తండ్రి స్పందించారు. ప్రస్తుతం తన కొడుకు ఇంట్లోనే ఉన్నాడని తెలిపారు. స్వల్ప గాయాలు కావడంతో కాళ్లల్లో నొప్పులతో బాధపడుతున్నాడని తెలిపారు. ఇజ్రాయెలీ సైనికుడు తన కొడుకుపై పెప్పర్ స్ప్రే చేశాడని కూడా అన్నారు. ‘నిందితుడు మాకు తెలుసు. వెస్ట్ బ్యాంక్ సరిహద్దు వద్ద ఇతరులతో కలిసి ఓ చిన్న సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గొర్రెలను మేపుకోవడానికి మా ప్రాంతం వైపు వస్తుంటాడు. రోడ్డును బ్లాక్ చేసి స్థానికులను ఇబ్బంది పెడుతుంటాడు’ అని బాధితుడి తండ్రి వాపోయాడు.
కాగా, నిందితుడిని గురువారం రాత్రే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు 5 రోజుల పాటు ఇంటి గడప దాటకుండా హౌస్ అరెస్టు చేసినట్టు తెలిపారు. అతడు కాల్పులకు తెగబడినట్టు కూడా స్థానిక మీడియా చెబుతోంది. ఐక్యరాజ్య సమితి డేటా ప్రకారం, ఇజ్రాయెలీ పౌరులు పాలస్తీనియన్‌లపై దాడి చేసిన ఘటనలు ఈ ఏడాది 750 వరకూ జరిగాయి. ఇక 2023 అక్టోబర్ 7, 2025 అక్టోబర్ 17 మధ్య కాలంలో ఈ దాడుల కారణంగా వెయ్యికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. పాలస్తీనావాసుల దాడుల్లో మరో 57 మంది ఇజ్రాయెలీలు మృతి చెందారు.
ఇవీ చదవండి:
ఇటుకలతో దాడి.. బంగ్లాదేశ్‌లో ప్రముఖ సింగర్ కార్యక్రమంలో షాకింగ్ ఘటన
బంగ్లాదేశ్‌లో మైనార్టీల పై దాడులను రాజకీయ హింసగా చూడలేం
Updated Date - Dec 27 , 2025 | 12:28 PM