Share News

James Concert Cancelled: ఇటుకలతో దాడి.. బంగ్లాదేశ్‌లో ప్రముఖ సింగర్ కార్యక్రమంలో షాకింగ్ ఘటన

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:08 AM

బంగ్లాదేశ్‌లో అల్లరి మూకలు రభస సృష్టించడంతో ప్రముఖ సింగర్ జేమ్స్ తలపెట్టిన సంగీత కార్యక్రమం శుక్రవారం రద్దయిపోయింది. మతమౌఢ్యంతో రెచ్చిపోయిన మూకలు ఇటుకలు, రాళ్లతో దాడి చేయడంతో నిర్వాహకులు కాన్సర్ట్‌ను క్యాన్సిల్ చేశారు.

James Concert Cancelled: ఇటుకలతో దాడి.. బంగ్లాదేశ్‌లో ప్రముఖ సింగర్ కార్యక్రమంలో షాకింగ్ ఘటన
James Concert Cancelled in Bangladesh

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. కళాకారులు, సాంస్కృతిక సంస్థలే టార్గెట్‌గా మతమౌఢ్యం పేరుకుపోయిన కొందరు రెచ్చిపోతున్నారు. తాజాగా అల్లరి మూకలు ఇలా నానా రభసా సృష్టించడంతో ఓ ప్రముఖ గాయకుడి సంగీత కార్యక్రమం రద్దయిపోయింది ( Singer James Concert Cancelled in Bangladesh).

ప్రముఖ సింగర్ జేమ్స్‌ ఆధ్వర్యంలో ఫరీద్‌పూర్‌లో ఓ సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక స్కూల్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. రాత్రి 9.00 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతలో అల్లరి మూకలు వేదిక వద్ద రణరంగాన్ని సృష్టించాయి. ప్రేక్షకులపైనా, వేదికపైనా ఇటుకలు, రాళ్లు విసిరి నానా రభసా చేశాయి. అక్కడున్న విద్యార్థులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి చేయి దాటడంతో చివరకు నిర్వాహకులు ఈవెంట్‌ను రద్దు చేశారు. స్థానిక అధికారుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనలో సుమారు 25 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది.


ఈ ఘటనపై ప్రముఖ రచయిత్ర తస్లీమా నస్రీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక సాంస్కృతిక వేదిక బూడిదగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ సంస్కృతుల మధ్య వారధిగా నిలవాల్సిన మరో సంస్థ కూడా బూడిదగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మరో మాయిస్ట్రో కళాకారుడు సిరాజ్ అలీ ఖాన్‌కు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లరి మూకల రభసతో ఆయన తన ప్రదర్శన ఇవ్వకుండానే వెనుదిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంగీతాన్ని ద్వేషించే జీహాదీలు ఉన్న బంగ్లాదేశ్‌లో ప్రదర్శన ఇచ్చేది లేదని అర్మాన్ ఖాన్ కూడా స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు.

ప్రభుత్వ అధికార యంత్రాంగం, పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తూ బంగ్లాదేశ్‌లో మతమౌఢ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతో, అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. ఛాయానౌత్, ఉడిచి వంటి సాంస్కృతిక సంస్థలతో పాటు ఆర్టిస్టులు, జర్నలిస్టులపైనా దాడులు పెరిగాయి. వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడేలా చేసేందుకు ప్రభుత్వమే ఇలాంటి అల్లర్లను ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.


ఇవీ చదవండి:

బంగ్లాదేశ్‌లో మైనార్టీల పై దాడులను రాజకీయ హింసగా చూడలేం

రేపు ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీ

Updated Date - Dec 27 , 2025 | 11:57 AM