West Asia War Ends: పశ్చిమాసియా ప్రశాంతం
ABN, Publish Date - Jun 25 , 2025 | 04:11 AM
పశ్చిమాసియాను యుద్ధ మేఘాలు వీడాయి. 12 రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన భీకర యుద్ధానికి ముగింపు లభించింది. ఆదివారం బీ2 బాంబర్లతో అమెరికా రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోగా.. సోమవారం ఖతార్, ఇరాక్‌లోని...
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ
12 రోజుల యుద్ధానికి ముగింపు
ముందుగానే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు
ట్రంప్ ప్రకటన తర్వాత కూడా భీకర దాడులు
ఇరు దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్
ఇజ్రాయెల్ పైలట్లు వెంటనే
వెనక్కి రావాలంటూ హెచ్చరికలు
అమెరికా ప్రాధేయపడడంతోనే కాల్పుల
విరమణకు అంగీకరించాం: ఇరాన్ మీడియా
ఇరాన్ అణు రియాక్టర్లు దెబ్బతినలే: ఐఏఈఏ
ఐఏఈఏ నుంచి వైదొలుగుతాం: ఇరాన్
టెహ్రాన్/టెల్‌అవీవ్/వాషింగ్టన్, జూన్ 24: పశ్చిమాసియాను యుద్ధ మేఘాలు వీడాయి. 12 రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన భీకర యుద్ధానికి ముగింపు లభించింది. ఆదివారం బీ2 బాంబర్లతో అమెరికా రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోగా.. సోమవారం ఖతార్, ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులతో.. కాల్పుల విరమణ వైపు అడుగులు పడ్డాయి. సోమవారం రాత్రే ట్రంప్ తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో.. ‘‘ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇరు దేశాలు దయచేసి ఒప్పందాన్ని ఉల్లంఘించొద్దు’’ అని పోస్టు చేశారు. ‘‘ఏకకాలంలో ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ కోసం నన్ను సంప్రదించాయి. దాంతో ఒప్పందానికి మార్గం సుగమమైంది. అర్ధరాత్రి 12 దాటాక(అమెరికా కాలమానం) తొలుత ఇరాన్ కాల్పుల విరమణను మొదలు పెడుతుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణకు సిద్ధమవుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ పేర్కొన్నట్లుగానే ఇరాన్ తొలుత కాల్పుల విరమణను ప్రకటించింది. అయితే.. కాల్పుల విరమణ కోసం ట్రంప్ ప్రాధేయపడ్డారని వెల్లడించింది. ఖతార్‌లోని అమెరికా బేస్‌లపై దాడుల తర్వాత కాల్పుల విరమణ కోసం ట్రంప్ ఇరాన్‌ను ప్రాధేయపడినట్లు బీబీసీ-పర్షియా కూడా ఓ వార్తను ప్రచురించింది.
ఇజ్రాయెల్ అంగీకారం..
ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణపై ప్రకటన చేసింది. ట్రంప్‌నకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు. అయితే.. ఇరాన్ నుంచి అణుముప్పు ఇంకా తొలగిపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ అన్ని లక్ష్యాలను ఇజ్రాయెల్ సాధించిందని చెప్పారు. ప్రత్యర్థి(ఇరాన్) నుంచి ఉన్న రెండు ప్రధాన ముప్పులను(అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణులు) తొలగించామన్నారు. అయితే, కాల్పుల విరమణను ప్రకటించడానికి చివరి నిమిషం వరకూ ఇరాన్ దాడులకు పాల్పడింది. పలు దఫాలుగా ఇజ్రాయెల్ పైకి క్షిపణులను ప్రయోగించింది. దీని కారణంగా టెల్‌అవీవ్ శివార్లలోని బీర్‌షెబాలోని ఓ భవనం తీవ్రంగా దెబ్బతినగా.. నలుగురు మృతిచెందారు. ఆ తర్వాత ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటన చేసింది. తమపై దాడుల తర్వాత ఇరాన్ ప్రకటన రావడం.. తాము ఎలాంటి ఒప్పందం చేసుకోకపోవడంతో.. ఇజ్రాయెల్ కూడా టెహ్రాన్‌పై ప్రతిదాడులు జరిపింది. ఇలా ఇరు దేశాలు పరస్పరం దాడులు జరుపుకొన్నట్లు నివేదికలు రావడంతో ట్రంప్ సీరియస్ అయ్యారు. ఇరు దేశాల చర్యలను తప్పుబట్టారు. ‘‘నేను వారితో(ఇరాన్) సంతృప్తిగా లేను. ఇజ్రాయెల్‌తో కూడా సంతృప్తిగా లేను’’ అని వ్యాఖ్యానించారు. హేగ్ నగరంలో జరగనున్న నాటో సదస్సుకు వెళ్లే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని, ఇజ్రాయెల్ తమ పైలట్లను తక్షణమే వెనక్కి రప్పించాలంటూ హెచ్చరికలు జారీచేశారు. ఇరాన్‌పై దాడి చేస్తే.. తీవ్ర ఉల్లంఘన కింద పరిగణిస్తామన్నారు.
అణు శాస్త్రవేత్త మృతి
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు అణు శాస్త్రవేత్త మహమ్మద్ సాబేర్ మృతిచెందారు. అమెరికా ఆంక్షల జాబితాలో సాబేర్ కూడా ఉన్నారు. ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో సాబేర్ 17 ఏళ్ల కుమారుడు కూడా చనిపోయారు. తాజా యుద్ధంలో మొత్తం 14 మంది ఇరాన్ అణు శాస్త్రవేత్తలు చనిపోయారు.
అణురియాక్టర్లపై దాడి జరగలేదు
ఇరాన్‌లోని అణుకేంద్రాల్లోని కొన్ని రియాక్టర్లపై దాడులు జరగలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఇస్ఫహాన్ సహా.. పలు అణుకేంద్రాల వద్ద రియాక్టర్లకు సంబంధించి విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు సైతం ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. కాగా, తన అణుకార్యక్రమాలపై ఐఏఈఏకు సమాచారం ఇవ్వడాన్ని నిలిపివేస్తామని, ఐఏఈఏ నుంచి వైదొలగుతామని ఇరాన్ ప్రకటించింది.
మరో 17 మంది తెలంగాణ వాసులు స్వదేశానికి
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల నుంచి మరో 17 మంది తెలంగాణ వాసులు స్వదేశానికి చేరుకున్నారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ రెండు దేశాల నుంచి ఇప్పటివరకు స్వదేశానికి చేరుకున్న తెలంగాణ పౌరుల సంఖ్య 23కు చేరిందని ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు పేర్కొన్నారు. ఆపరేషన్ సింధులో భాగంగా భారత అధికారులు మంగళవారం ఇరాన్ నుంచి 292 మందిని, ఇజ్రాయెల్ నుంచి 326మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చారు. మరోవైపు, కాల్పుల విరమణ నేపథ్యంలో పశ్చిమాసియా గగనతలం మీదుగా విమాన సర్వీసులను క్రమంగా పెంచుతామని ఎయిర్ ఇండియా మంగళవారం ప్రకటించింది. బుధవారానికల్లా విమాన సర్వీసులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని పేర్కొంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు శంషాబాద్ నుంచి వెళాల్సిన, రావాల్సిన పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి.
Updated Date - Jun 25 , 2025 | 05:55 AM