US Immigration: పిల్లల గ్రీన్‌కార్డుకు వయసు తిప్పలు
ABN, Publish Date - Aug 10 , 2025 | 02:50 AM
అమెరికాలో శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌కార్డుల నిబంధనల్లో మార్పు భారత సంతతి కుటుంబాలకు
దరఖాస్తు చేసిన తేదీ కాకుండా..వీసా మంజూరైన తేదీయే పరిగణనలోకి
ఈ నెల 15 నుంచే అమెరికాలో కొత్త నిబంధనలు
తల్లిదండ్రులకు గ్రీన్‌కార్డు వచ్చినా.. పిల్లలకు కష్టమే!
వాషింగ్టన్, ఆగస్టు 9: అమెరికాలో శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌కార్డుల నిబంధనల్లో మార్పు భారత సంతతి కుటుంబాలకు ఆశనిపాతంగా మారనుంది. సాధారణంగా అక్కడ ఉద్యోగం, వ్యాపారాలు చేసే విదేశీయులు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఆ కుటుంబాల్లోని 21 ఏళ్లలోపు వయసుండి, వివాహం కాని పిల్లలకు కూడా ‘చైల్డ్ స్టేటస్ ప్రొటెక్షన్ యాక్ట్ (సీఎ్‌సపీఏ)’ కింద గ్రీన్‌కార్డు ఇస్తారు. ఇందుకోసం ఇన్నాళ్లుగా వారు దరఖాస్తు చేసుకున్న నాటి వయసును పరిగణనలోకి తీసుకునేవారు. ఇకపై వారి గ్రీన్‌కార్డు దరఖాస్తు ప్రాసెసింగ్/మంజూరు నాటి వయసును పరిగణనలోకి తీసుకునేలా ట్రంప్ ప్రభుత్వం మార్పులు చేసింది. ఆగస్టు 15 తర్వాతి నుంచి గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఇది భారత సంతతివారిపై, ముఖ్యంగా ఈబీ-2, ఈబీ-3 కేటగిరీల్లోని భారతీయులకు ఇబ్బందిగా మారనుంది. అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరుకోసం ఏళ్లకేళ్లు, ఒక్కోసారి దశాబ్దం పాటు ఎదురుచూడాల్సిందే. ఈ క్రమంలో దరఖాస్తు నాటికి, మంజూరు నాటికి కుటుంబాల్లోని పిల్లల వయసు పెరిగిపోతుంది. చాలా మంది 21 ఏళ్లు దాటిపోతారు. దానితో వారికి ‘సీఎ్‌సపీఏ’ కింద గ్రీన్‌కార్డు మంజూరు చేయరు. చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. వారంతా విద్యార్థి వీసా (ఎఫ్-1)కు మారడం లేదా తాత్కాలిక హోదా కోసం దరఖాస్తు చేసుకోవడం తప్పదు.
‘ఉద్యోగం’ వదిలితే స్వదేశాలకే..
తాత్కాలిక ఉద్యోగ వీసాలపై వచ్చి.. నిర్ణీత ఉద్యోగంలో చేరకుండా ఉన్నాగానీ, ఆ ఉద్యోగాన్ని వదిలేసిన వెంటనే స్వదేశానికి వెళ్లిపోకుండా అమెరికాలోనే ఉండేవారుగానీ కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదని ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఫ్లోరిడాలో ఉద్యోగం కోసం హెచ్-2ఏ వీసాపై వచ్చిన ఓ వ్యక్తి సదరు సంస్థలో చేరకుండా, మరో చోటికి వెళ్లారని.. ఆ వ్యక్తిని గుర్తించి కేసు నమోదు చేశామని వివరించింది. ఇలాం టి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది.
Updated Date - Aug 10 , 2025 | 02:50 AM