US F-16C Crash: కూలిన అమెరికా ఎఫ్-16సీ ఫైటర్ జెట్.. పైలట్ సేఫ్
ABN, Publish Date - Dec 04 , 2025 | 08:01 AM
అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16సీ ఫైటింగ్ ఫాల్కన్ యుద్ధ విమానం బుధవారం కాలిఫోర్నియాలో కూలిపోయింది. అయితే, పైలట్ సురక్షితంగా విమానం నుంచి బయటపడ్డారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్ ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్ బుధవారం కూలిపోయింది. కాలిఫోర్నియాలోని ట్రోనా ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. థండర్‌బర్డ్స్ స్క్వాడ్రన్‌కు చెందిన ఈ విమానం శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో అకస్మాత్తుగా కూలిపోయింది. విమానం నేలను ఢీకొనగానే ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అయితే, ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు పైలట్ విమానం నుంచి బయటపడటంతో ప్రాణహాని తప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి (US F-16 Fighting Falcon Crash California).
ఈ ఘటనపై యూఎస్ ఎయిర్‌ఫోర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. స్థానిక కాలమానం ప్రకారం, బుధవారం ఉదయం 10.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలిపింది. పైలట్‌కు స్వల్ప గాయాలు అయ్యాయని, ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని తెలిపింది.
అధికార వర్గాలు తెలిపిన దాని ప్రకారం, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మొత్తం ఆరు విమానాలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనగా ఒకటి కూలిపోయింది. ఘటనపై దర్యాప్తు ప్రారంభమైనట్టు ఎయిర్ ఫోర్స్ తెలిపింది.
సింగిల్ ఇంజన్, మల్టీ రోల్ ఎఫ్-16సీ ఫైటింగ్ ఫాల్కన్‌ను సాధారణంగా యూఎస్ వైమానికదళ బల ప్రదర్శన విన్యాసాల్లో అధికంగా వినియోగిస్తారు. థండర్‌బర్డ్స్ స్క్వాడ్రన్ నిత్యం నిర్వహించే గగనతల విన్యాసాలకు ఈ విమానం కీలకం.
ఇవీ చదవండి:
తీరు మార్చుకోని పాక్.. భారత గగనతలంలోకి విమానాలను అనుమతించినా..
ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా ఆదాయాన్ని కోల్పోనున్న అమెరికా యూనివర్సిటీలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 04 , 2025 | 11:20 AM