Trump Vs Putin: ఉక్రెయిన్ కోసం రంగంలోకి ట్రంప్.. పుతిన్‌కు ఫోన్
ABN, Publish Date - Oct 17 , 2025 | 10:36 AM
ఉక్రెయిన్, రష్యా మధ్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు భారీగా క్షిపణులు అందజేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. ఇదే విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి తెలిపారు.
వాషింగ్టన్, అక్టోబర్ 17: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధాన్ని ఆపడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకంగా వ్యవహరించారు. అలాగే రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ఆయన తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఉక్రెయిన్‌లో శాంతి కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఎలాగైనా ఒప్పించాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఉక్రెయిన్‌కు ఆయన బాసటగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి తోమహాక్ క్షిపణులు భారీగా అందచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ కాల్ ద్వారా వివరించినట్లు ట్రంప్ వెల్లడించారు.
శుక్రవారం ట్రంప్ విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ అంశంపై పుతిన్ ఎలా స్పందించారంటూ ట్రంప్‌ను విలేకర్లు ప్రశ్నించారు. మీ ప్రత్యర్థికి ఇలా భారీగా తోమహాక్ క్షిపణులు అందజేస్తే.. మీకు ఏమైనా అభ్యంతరమా? అంటూ పుతీన్‌ను తాను ప్రశ్నించారని చెప్పారు. దీనిని ఆయన బలంగా వ్యతిరేకించారంటూ పుతిన్ రియాక్షన్‌ను ట్రంప్ వివరించారు. ఈ ఆలోచన పుతిన్‌కు నచ్చలేదని పేర్కొన్నారు.
తోమహాక్ అతిదారుణమైన.. అతి విధ్వంసకర ఆయుధమని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేశారు. ఈ తరహా దీర్ఘశ్రేణి ఆయుధంతో తమపై దాడి చేయాలని ఎవరూ కోరుకోరన్నారు. మరోవైపు పుతిన్‌తో జరిగిన తన సంభాషణ అద్భుతంగా సాగిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు.
మరికొద్ది రోజుల్లో హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో పుతిన్‌తో తాను సమావేశం కానున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధానికి బీజం పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక ఈ తోమహాక్ క్షిపణుల అంశంపై ట్రంప్‌తో పుతిన్ మాట్లాడారని రష్యా స్పష్టం చేసింది. అయితే ఈ క్షిపణులు ఉక్రెయిన్‌కు అందజేయడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలకు విఘాతం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు ట్రంప్‌కు పుతిన్ తెలిపారని పేర్కొంది.
Updated Date - Oct 17 , 2025 | 10:45 AM