Donald Trump: సుంకాలు అమల్లోనే ఉన్నాయి.. కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
ABN, Publish Date - Aug 30 , 2025 | 08:41 AM
సుంకాల విధింపు చట్టవ్యతిరేకమంటూ స్థానిక కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చే వరకూ సుంకాలు అమల్లోనే ఉంటాయని స్పష్టం చేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: వివిధ దేశాలపై అమెరికా విధించిన సుంకాలు అమల్లోనే ఉన్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. సుంకాలు చట్టవ్యతిరేకమంటూ అప్పీల్స్ కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వివరణ ఇచ్చారు. సుంకాలు చట్ట వ్యతిరేకమన్న న్యాయస్థానం తీర్పుపై సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు ట్రంప్ సర్కారుకు కొంత గడువిచ్చింది.
‘అన్ని సుంకాలు అమల్లోనే ఉన్నాయి. సుంకాలు తొలగించాలంటూ అప్పీల్స్ కోర్టు అసంబద్ధమైన తీర్పు ఇచ్చింది. కానీ ఈ తుదకు విజయం అమెరికాదే. ఈ సుంకాలను తొలగిస్తే దేశానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఆర్థికంగా మనం బలహీనపడతాం. మనం ధైరంగా నిలబడాలి’ అని ఆయన తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు.
వాణిజ్య లోటు, ఇతర దేశాలు తమపై అన్యాయంగా విధిస్తున్న సుంకాలను అమెరికా ఇక ఎంతమాత్రం సహించదని ట్రంప్ స్పష్టం చేశారు. మిత్ర దేశమైనా ప్రత్యర్థి దేశమైనా అమెరికా కంపెనీలు, రైతులు, ఇతరులకు వాణిజ్య పరమైన అడ్డంకులు సృష్టిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. సుంకాలు రద్దు చేసిన కోర్టు తీర్పును అంగీకరిస్తే అమెరికా నాశనం అవుతుందని హెచ్చరించారు.
మేడ్ ఇన్ అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు, అమెరికా ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ఇతర దేశాలపై సుంకాల విధింపు తప్పనిసరి అని ట్రంప్ వాదిస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టి దాదాపు 7 నెలలు అవుతోంది. రెండో సారి అధికారంలోకి వచ్చాక డొనాల్డ్ ట్రంప్ సుంకాలనే ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారు. సుంకాల బెదిరింపుతో పలు దేశాలను లొంగదీసుకుని డీల్స్ కుదుర్చుకునే ప్రయత్నం చేయడం, లొంగని దేశాలపై భారీగా సుంకాలను పెంచడం చేస్తున్నారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికాలోనే ట్రంప్ సర్కారు నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం భారత్, బ్రెజిల్ ఉత్పత్తులపై ట్రంప్ సర్కారు ఏకంగా 50 శాతం సుంకం విధిస్తోంది.
ఇవి కూడా చదవండి:
భారత్‌పై అమెరికా సుంకాలు.. ఏనుగుపై ఎలుక దాడి లాంటివే: అమెరికా ఆర్థికవేత్త
భారత్‌పై అక్కసు.. శ్వేతసౌధం సలహాదారు షాకింగ్ కామెంట్స్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 30 , 2025 | 08:54 AM