Share News

Richard Wolff: భారత్‌పై అమెరికా సుంకాలు.. ఏనుగుపై ఎలుక దాడి లాంటివే: అమెరికా ఆర్థికవేత్త

ABN , Publish Date - Aug 29 , 2025 | 10:33 AM

భారత్‌పై సుంకాలతో అమెరికా తనకు తానే నష్టం చేసుకుంటోందని అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వుల్ఫ్ అభిప్రాయపడ్డారు. ఈ సుంకాలు.. ఏనుగుపై ఎలుక దాడి చేయడం లాంటివని వ్యాఖ్యానించారు. ట్రంప్ చర్యలతో బ్రిక్స్ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

Richard Wolff: భారత్‌పై అమెరికా సుంకాలు.. ఏనుగుపై ఎలుక దాడి లాంటివే: అమెరికా ఆర్థికవేత్త
US India tariffs 2025

ఇంటర్నెట్ డెస్క్: సుంకాలతో భారత్‌పై ఒత్తిడి పెంచామనుకుంటున్న అమెరికా పాలకులకు అక్కడి ఆర్థికవేత్తలు ప్రమాద హెచ్చరికలు చేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వుల్ఫ్ చేరారు. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు ఏనుగును ఎలుక ఢీకొట్టడమేనని వ్యాఖ్యానించారు. అమెరికా తనకు తానే చేటు తెచ్చుకుంటోందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ తీరుతో బ్రిక్స్ కూటమి పాశ్చాత్య దేశాలకు పోటీగా మరింత బలోపేతం అవుతోందని అన్నారు.

‘ఐక్యరాజ్య సమితి ప్రకారం, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. కాబట్టి అమెరికా విధించే సుంకాలు ఏనుగుపై ఎలుక దాడి లాంటివే. అమెరికాకు ఎగుమతులకు ఆటంకాలు ఏర్పడితే భారత్ మరో ప్రత్యామ్నాయం వెతుక్కుంటుంది. బ్రిక్స్ కూటమి మరింత బలోపేతం అవుతుంది. ఆంక్షల తరువాత రష్యా తన చమురును ఇతర దేశాలకు విక్రయిస్తోంది. ఇండియా కూడా ఇలాగే చేస్తుంది. ఇతర బ్రిక్స్ దేశాలకు ఎగుమతి చేస్తుంది. రష్యా, చైనా, ఇండియా సహా బ్రిక్స్ దేశాల వాటా మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 35 శాతం. జీ7 దేశాల వాటా కేవలం 28 శాతమే. (అమెరికా ప్రభుత్వం) బ్రిక్స్‌ను మరిత బలోపేతం చేస్తోంది. సభ్య దేశాలను మరింత దగ్గర చేస్తోంది. పాశ్చాత్య ప్రపంచానికి విజయవంతమైన ప్రత్యామ్నాయంగా నిలుపుతోంది. ప్రస్తుతం మనం ఓ చారిత్రాత్మక ఘట్టాన్ని చూస్తున్నాము’ అని ఆయన అన్నారు.


వాణిజ్య లోటు, రష్యా నుంచి చమురు కొనుగోలు తదితర కారణాలతో భారత్‌పై ట్రంప్ సర్కారు 50 శాతం సుంకం విధిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నుంచి ఈ సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇక అమెరికా తీరుపై భారత్ మండిపడుతోంది. ఏకపక్ష చర్యలు వద్దని హితవు పలికింది. ఇక బ్రిక్స్ కూటమిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి నుంచి విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికా డాలర్‌ ఆధిపత్యానికి బ్రిక్స్ దేశాలు చేటు చేసేందుకు ప్రయత్నిస్తే 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. బ్రిక్స్ కూటమి కథ ముగిసిందని పలుమార్లు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి:

భారత్‌పై అక్కసు.. శ్వేతసౌధం సలహాదారు షాకింగ్ కామెంట్స్

ట్రంప్ చేతిపై మళ్లీ ఎర్రని మచ్చ.. అసలేం జరుగుతోంది

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 10:43 AM