Trump Hand Bruise: ట్రంప్ చేతిపై మళ్లీ ఎర్రని మచ్చ.. అసలేం జరుగుతోంది
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:08 PM
ట్రంప్ చేయి మణికట్టు కింద ఎర్రగా కందిపోయినట్టు ఉన్న ఫొటోలు మళ్లీ వైరల్‌గా మారాయి. అయితే, ట్రంప్ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకాలేదని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుడి చేయి మణికట్టు దిగువ భాగంపై చర్మం కందిపోయినట్టు ఎర్రగా మారడం ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తోంది. అంతకుముందు ఆయన ఎడమచేతిపై కూడా దాదాపు ఇలాంటి సమస్యే కనిపించింది. దీంతో, ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే, కంగారు పడాల్సిందేమీ లేదని శ్వేత సౌధం వైద్య వర్గాలు తెలిపాయి. ట్రంప్ చేయిపై గతంలోనూ ఇలాంటివి కనిపించాయి. అప్పట్లో ఈ మచ్చలు కనిపించకుండా ట్రంప్ తన చేతికి ఫౌండేషన్‌తో లైట్‌గా మేకప్ కూడా వేసుకున్నారు. ఈసారి మాత్రం అలాంటి జాగ్రత్త ఏమీ తీసుకోకపోవడంతో మరోసారి మీడియా కంట పడింది.
సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో సమావేశమయ్యారు. మీటింగ్‌కు ముందు ఇరు దేశాధినేతలు కరచాలనం చేసుకుంటుండగా తీసిన ఫొటోల్లో ట్రంప్ చేయిపై గాయాల్లాంటి మచ్చ కనిపించడం మరోసారి కలకలానికి దారితీసింది. ట్రంప్ ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అంశంపై శ్వేత సౌధం అధికారిక వైద్యుడు డా. షాన్ బార్బెల్లా, ప్రెస్ సెక్రెటరీ కెరొలీన్ లెవిట్ గతంలోనే వివరణ ఇచ్చారు. ట్రంప్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని భరోసా ఇచ్చారు. 79 ఏళ్ల ట్రంప్ నిత్యం అనేక మంది అతిథులతో కరచాలనం చేస్తారని, పైపెచ్చు ఆస్పిరిన్ ఔషధం వాడతారని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో చర్మంలోని సున్నిత కణజాలం కాస్త కందిపోయినట్టు కనిపిస్తుందని వివరించారు. ఆర్టీరియల్ (ధమనులు) సమస్యలు, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వంటివేమీ లేవని అన్నారు. ఇది వృద్ధుల్లో సాధారణంగా కనిపించే క్రానిక్ వీనస్ ఇన్‌సఫిషియన్సీ అని చెప్పుకొచ్చారు. ముందుజాగ్రత్త చర్యగా వైట్ హౌస్ వైద్యం బృందం ట్రంప్ ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించిందని కూడా చెప్పారు. ట్రంప్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని భరోసా ఇచ్చారు.
ఏమిటీ క్రానిక్ వీనస్ ఇన్‌సఫిషియన్సీ..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, సిరలు అనే రక్తనాళాల్లోని ప్రవాహాన్ని నియంత్రించే వాల్వ్‌లు (కవాటాలు) సరిగా పనిచేయకపోవడాన్ని వీనస్ ఇన్‌సఫిషియన్సీ అని పిలుస్తారు. సిరల్లోని ప్రవాహాన్ని గుండెవైపు మాత్రమే అనుమతించేలా ఈ కవాటాల నిర్మాణం ఉంటుంది. ఇవి బలహీన పడ్డ సందర్భాల్లో రక్త ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడి ఇలాంటి ఎర్రని మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. వృద్ధుల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్యకు సరైన చికిత్సలు అందితే ఎలాంటి ఇబ్బందులు రావని వైద్యులు చెబుతారు.
ఇవి కూడా చదవండి:
తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త.. ప్రపంచదేశాలకు ట్రంప్ హెచ్చరిక
భారత్‌పై సుంకాలు.. బహిరంగ నోటీసు జారీ చేసిన అమెరికా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి