Share News

US Tariffs on India: భారత్‌పై సుంకాలు.. బహిరంగ నోటీసు జారీ చేసిన అమెరికా

ABN , Publish Date - Aug 26 , 2025 | 08:16 AM

అదనపు సుంకాలు విధింపుపై అమెరికా బహిరంగ నోటీసు విడుదల చేసింది. ఆగస్టు 27 అర్ధరాత్రి 12.01 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

US Tariffs on India: భారత్‌పై సుంకాలు.. బహిరంగ నోటీసు జారీ చేసిన అమెరికా
Trump India Tariffs

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌పై సుంకాల గురించి అమెరికా తాజాగా కీలక ప్రకటన చేసింది. భారత ఉత్పత్తులపై గతంలో ప్రకటించిన సుంకాలు స్థానిక కాలమానం ప్రకారం ఆగస్టు 27 అర్ధరాత్రి 12.01 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ద్వారా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ పబ్లిక్ నోటీసు విడుదల చేసింది. సుంకాల పెంపుపై ఆగస్టు 6న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నెం.14329ను పేర్కొంది. నాటి ఆదేశాల్లో ట్రంప్.. రష్యాతో అమెరికాకు ఉన్న ముప్పు గురించి పేర్కొన్నారు. ఈ ముప్పును తట్టుకునే విధానంలో భాగంగా భారత్‌పై సుంకాల గురించి ప్రస్తావించారు. ఆ ఆదేశాల్లో పేర్కొన్న పలు భారతీయ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తారు.


రష్యాతో వాణిజ్యం జరుపుతున్న దేశాలపై మళ్లీ సుంకాలను పెంచుతామంటూ ట్రంప్ సంకేతాలిచ్చారు. రష్యాతో డీల్ కుదరకపోతే సుంకాలు తప్పవని అన్నారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భారత్‌పై సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా చైనాను మాత్రం ఉపేక్షిస్తున్న విషయం తెలిసిందే. భారత్ కంటే ఎక్కువ మొత్తంలో చైనా రష్యా చమురును కొనుగోలు చేస్తోంది.

కాగా, భారత్‌పై విధించిన అదనపు సుంకాలపై కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది. అదనపు సుంకాల విధింపు అన్యాయమని, సమర్థనీయం, సహేతుకం కాదని స్పష్టం చేసింది. అదనపు సుంకాలు విచారకరమన్న భారత్.. దేశీయ ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని ప్రకటించింది.


ఇక ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కూడా స్పందించారు. అమెరికా ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఏదో ఒక మార్గం కనుక్కుంటామని దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. ‘ఎంత ఒత్తిడినైనా ఎదుర్కునేలా శక్తిమంతం అవుతాము. ఆత్మనిర్భర భారత్ దిశగా మంచి పురోగతి సాధిస్తున్నాం. దీని వెనకాల రెండు దశాబ్దాల నాటి శ్రమ ఉంది. ఇందులో గుజరాత్ రాష్ట్రం పాత్ర ఎంతో ఉంది’ అని అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

పొంచి ఉన్న వరద ముప్పు.. పాక్‌ను భారత్ అప్రమత్తం చేసిందా..

టారిఫ్‌లతో అమెరికాకు ఎంత ప్రయోజనం కలుగుతుందంటే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 26 , 2025 | 08:32 AM